ఆహార వృథా నియంత్రణే ‘గుడ్ టు గ్రాబ్’ లక్ష్యం

హైదరాబాద్‌ రెస్టారెంట్లలో సాగుతున్న ఆహార వృథాను అరికట్టేందుకు ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు.మిగులు ఆహారాన్ని సగం ధరకే విక్రియంచేందుకు కంపెనీని ప్రారంభించారు.;

Update: 2025-04-06 00:00 GMT
సస్టెనబుల్ భావిరాన్ అవార్డు అందుకుంటున్న గుడ్ టు గ్రాబ్ వ్యవస్థాపకులు పిట్ల సాయికిషోర్, అనుగు శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన పిట్ల సాయికిషోర్, అనుగు శ్రీకాంత్ రెడ్డిలిద్దరూ స్నేహితులు. వీరికి యూకేలో ఉన్నత చదువులు చదవడంతో అక్కడే మంచి ఉద్యోగం లభించింది.చేస్తున్న ఉద్యోగం సంతృప్తి ఇవ్వక పోవడంతో వీరిద్దరూ వారి ఉద్యోగాలను వదిలి, యూకేకు గుడ్ బై చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చారు. యూకేలోని హోటళ్లలో మిగులు ఆహారాన్ని అవసరమైన వారికి సగం ధరలకే విక్రయించే ఆన్‌లైన్ సంస్థలుండటం చూశారు. హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో వేల మెట్రిక్ టన్నుల ఆహారం ప్రతీ రోజూ చెత్తకుండీల పాలవుతుండటం చూశారు. అంతే సామాజిక బాధ్యతగా తీసుకొని ఇలా ఆహారం వృథా కాకుండా నగరంలోని రెస్టారెంట్లలో మిగులు ఉన్న మంచి ఆహారాన్ని సగం ధరకే విక్రయించేందుకు వీలుగా ‘గుడ్ టు గ్రాబ్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు.దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను రూపొందించి రెస్టారెంట్లు, బేకరీలు, కస్టమర్లను ఆన్ లైన్ ద్వారా కలిపి ఆహార వృథాకు తెర వేశారు. స్టార్టప్ కంపెనీని పెట్టి పలువురు ప్రముఖుల ప్రశంసలందుకున్న యంగ్ తరంగ్‌లు సాయి కిషోర్, శ్రీకాంత్ రెడ్డిలు సాగిస్తున్న విజయయాత్రపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రత్యేక కథనం అందిస్తుంది. ఉన్నతవిద్యావంతులైన యంగ్ తరంగ్ ల విజయయాత్ర గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి.




 మేం కలిసి చదువుకున్నాం...

‘‘హైదరాబాద్ నగరానికి చెందిన మేమిద్దరం గత 13 ఏళ్లుగా స్నేహితులం. మేమిద్దరం అనురాగ్ కళాశాలలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు చదివాం. ఆ తర్వాత యూకేలోని యూనివర్శిటీ సౌతాంప్టన్ లో డిప్లొమా ఇన్ ఫార్మకాలజీ కోర్సు చేశాం. కోర్సు అయిపోయాక మాకు యూకేలోని హాస్పిటల్ సౌతాంప్టన్ ఎన్ హెచ్ ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో ట్రైనీ బయోమెడికల్ సైంటిస్ట్‌గా,క్లినికల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు వచ్చాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక స్వదేశానికి వచ్చి ఏదైనా చేయాలనే ఆశయంతో మేం 2023 డిసెంబరులో ఉద్యోగాలకు రాజీనామా చేశాం.

రెస్టారెంట్ పెట్టాం...
అనంతరం 2024 ఫిబ్రవరి నెలలో మా స్వస్థలమైన హైదరాబాద్ నగరానికి తిరిగివచ్చి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ‘అమోఘం’ పేరిట రెస్టారెంట్ ను ప్రారంభించాం. కూకట్ పల్లిలో ఎక్కువగా విద్యార్థులు నివాసముండటంతో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా, మా ప్రాంతంలో ఉన్న మూడు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలున్నా మా రెస్టారెంట్ లో ఆహారం మిగిలిపోతుండేది. మిగిలిపోయిన మంచి ఆహారాన్ని చెత్తబుట్టలో పడేయడం ఇష్టం లేక మేం కవర్లలో ప్యాక్ చేయించి వాటిని వీధుల్లో నివాసముంటున్న వారికి ఉచితంగా పంపిణీ చేసేవాళ్లం.

ఆహారం వృథాపై పరిశోధించాం...
ఒక వైపు ఆహారం కోసం పేదలు అలమటిస్తుంటే మరో వైపు ఆహారాన్ని డస్ట్ బిన్ల పాలు చేస్తుండటం మమ్మల్ని కలిచివేసింది. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఆహార వృథాను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి కూడా నడుం కట్టింది. ఆహారాన్ని వృథా చేయడం వల్ల భూమి, నీరు, విద్యుత్ వృథా అవుతున్నాయని గుర్తించాం. ప్రపంచంలో చైనా దేశం తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా ఫుడ్ వేస్ట్ అవుతోంది. ప్రతీ రోజూ 78 వేల మెట్రిక్ టన్నుల ఆహారం వృథా అవుతుందని అంచనా. దీంతో మేం ఆలోచించి ఈ ఆహార వృథాకు అడ్డుకట్టు వేయాలంటే(Curb Food Waste) మిగులు ఉన్న మంచి ఆహారాన్ని (Surplus food)అవసరమైన వారికి సగం ధరలకే అందించాలని నిర్ణయించుకున్నాం. దీని కోసం మేం యూకే తరహాలో ‘గుడ్ టు గ్రాబ్’(Good to Grab)పేరిట ఓ కంపెనీని నెలకొల్పి, మిగులు ఆహారం డిస్కౌంట్ ధరలకు విక్రయించేందుకు వీలుగా ఆన్ లైన్ యాప్ ను రూపొందించాం.(Available at 50 percent discount)



 45వేల మందికి మిగులు ఆహారాన్ని అందించాం

హైదరాబాద్ నగరంలో 80కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలతో ఒప్పందాలు చేసుకొని, వారి వద్ద మిగిలిన మంచి ఆహారాన్ని సగం ధరలకే వినియోగదారులకు అందిస్తున్నాం. మా యాప్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 45వేల మంది కస్టమర్లు యాప్ ను డౌన్ లౌడ్ చేసుకున్నారు, ఇందులో ప్రతీ రోజూ వెయ్యిమంది దాకా కస్టమర్లు యాక్టివ్ గా ఉన్నారు. క్రుతుంగా రెస్టారెంట్, బ్రౌన్ బియర్ రెస్టారెంట్, కేఎస్ బేకర్స్ లాంటి సంస్థలు తమతో ఒప్పందాలు చేసుకొని సగం ధరలకే మిగులు ఆహారాన్ని విక్రయిస్తున్నాయి.

మిగులు ఆహారం విక్రయం ఎప్పుడంటే...
మిగులు ఆహారం 50 శాతం డిస్కౌంటు ధర విక్రయాలకు గుడ్ టు గ్రాబ్ పక్షాన మేం నిర్ణీత సమయాలను నిర్దేశించాం. లంచ్ సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా, డిన్నర్ రాత్రి 10 నుంచి 11.30 గంటల వరకు విక్రయిస్తున్నాం. మిగులు ఆహారం అంటే మంచి ఆహారాన్నే విక్రయిస్తున్నామని, డిస్కౌంటు ధరకు ఇస్తున్నామంటే మంచిది కాదని భావించవద్దు. మేం ఇప్పటివరకు 15వేలకు పైగా భోజనాలను డిస్కౌంట్ ధరలకు విక్రయించాం. సుమారు ఆహార వృథా వల్ల 37,500 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు ఏర్పడకుండా నిరోధించాం, దేశంలో ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించే ప్రపంచ లక్ష్యానికి మేం సైతం దోహదపడ్డాం.



పర్యావరణ పరిరక్షణ కోసం...

హైదరాబాద్‌కు చెందిన 'గుడ్ టు గ్రాబ్' అనే మా స్టార్టప్ వల్ల మిగులు ఆహారం విక్రయాలతో అటు వ్యాపారులకు,ఇటు వినియోగదారులకు ఇద్దరికీ అవకాశంగా మారింది. మా వినూత్న యాప్ ద్వారా ఐదు మెట్రిక్ టన్నులకు పైగా ఆహారాన్ని చెత్తలో పారవేయకుండా ఆదా చేశాం. మిగులు ఆహారాన్ని చెత్తలో పడేస్తే అది కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా శక్తివంతమైన వాయువు అయిన మీథేన్‌ను విడుదల చేస్తుంది.ఇది వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంది. దీనివల్ల పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది.

గుడ్ టు గ్రాబ్ ఎలా పనిచేస్తుందంటే...
గుడ్ టు గ్రాబ్ రెస్టారెంట్లు, కస్టమర్లకు మధ్య వారధిగా పనిచేస్తుంది. 50శాతం తగ్గింపు ధరతో మిగులు ఆహారాన్ని అందిస్తున్నాం.రెస్టారెంట్లు తమ మిగులు ఆహార జాబితా వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తాయి, అక్కడ నుంచి కస్టమర్లు మిగులు ఆహారం లభ్యత ఆధారంగా తమ ఆర్డర్‌లను ఉంచవచ్చు. కొనుగోలుదారులు తమ ఆర్డర్ సిద్ధంగా ఉన్నప్పుడు సమాచారం అందుకుంటారు. ఆహారాన్ని రెస్టారెంట్ నుంచి కస్టమర్లు నేరుగా తీసుకుంటారు.టేక్‌అవేపై దృష్టి పెట్టడం వల్ల రవాణా సంబంధిత వ్యర్థాలు, కాలుష్యం తగ్గుతుంది. మిగులు ఆహారం నుంచి అదనపు ఆదాయాన్ని పొందండి, మీకు, మీ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడం ఈ స్టార్టప్ లక్ష్యం. ఇందులో భాగంగా మేం బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ తో కలిసి పనిచేస్తున్నాం’’అని తమ విజయయాత్రను గుడ్ టు గ్రాబ్ వ్యవస్థాపకులు పిట్ల సాయికిషోర్, అనుగు శ్రీకాంత్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు వివరించి చెప్పారు.

డబ్బు ఆదా చేశాను : మాడబోయిన వేణు, విద్యార్థి, బోయిన్ పల్లి
‘‘గుడ్ టు గ్రాబ్‌తో నేను డబ్బు ఆదా చేశాను, అదే సమయంలో ప్రఖ్యాత రెస్టారెంట్లలో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాను, ఆహార వ్యర్థాలను తగ్గించి సానుకూల ప్రభావాన్ని చూపడానికి కూడా దోహదపడ్డాను.’’

భారీ డిస్కౌంట్ లభించింది : - వెన్నెల మెంగాని,విద్యార్థిని, హైదరాబాద్
‘‘నేను గుడ్ టు గ్రాబ్ నుంచి కొన్ని కేక్‌లను ఆర్డర్ చేశాను, ఆర్డర్ చేయడం, పికప్ చేసుకోవడం చాలా సులభం. గుడ్ టు గ్రాబ్ నుంచి నేను ఆర్డర్ చేయడానికి ప్రధాన కారణం యాప్ అందించే భారీ డిస్కౌంట్. ఇది నిజంగా డబ్బు ఆదా చేస్తుంది. దీని వెనుక ఉన్న చొరవ నాకు నచ్చింది.ఇంత మంచి కాజ్ కోసం నేను సహకరించగలగడం సంతోషాన్నిస్తుంది.’’



 గుడ్ టు గ్రాబ్ కు అవార్డు

మిగులు ఉన్న మంచి ఆహారాన్ని వృథా కాకుండా విక్రయిస్తున్న గుడ్ టు గ్రాబ్ సంస్థ వ్యవస్థాపకులు పిట్ల సాయికిషోర్, అనుగు శ్రీకాంత్ రెడ్డిలకు సస్టెనబుల్ భావిరాన్ అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ స్టార్టప్ కంపెనీ గుడ్ టు గ్రాబ్ కు ఆర్థిక గ్రాంటు ఇచ్చి ప్రోత్సహించింది. గుడ్ టు గ్రాబ్ వ్యవస్థాపకులు పిట్ల సాయికిషోర్, అనుగు శ్రీకాంత్ రెడ్డిలను లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభినందించారు.




Tags:    

Similar News