కంటోన్మెంట్ నివాసులకు శుభవార్త..సివిల్ ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి
కంటోన్మెంట్ ప్రాంతంలోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
By : Shaik Saleem
Update: 2024-06-26 06:20 GMT
సికింద్రాబాద్ కంటోన్మెంటు ప్రజలకు శుభవార్త. కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ విలీన విధి విధానాలపై నివేదిక రూపొందిస్తోంది.
- జీహెచ్ఎంసీకి చేరువలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సివిల్ ప్రాంతాలు కేంద్రం పరిధిలోని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. అటు కేంద్రం నుంచి నిధులు రాక, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు సివిల్ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.
- కంటోన్మెంటులోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు కేంద్ర ఢిఫెన్స్ సెక్రటరీ ఎ గిరిధర్ మంగళవారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కంటోన్మెంట్ బోర్డు, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రత్యేకత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల చుట్టూ మల్కాజిగిరి, అల్వాల్, కూకట్‌పల్లి, కాప్రా పూర్వపు మునిసిపాలిటీలు ఉన్నాయి.ఈ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దేశంలోనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం.ఇది కంటోన్మెంట్ పరిధిలో గరిష్టంగా ప్రైవేట్ భూములున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైశాల్యం 40.17 చదరపు కిలో మీటర్లు. కంటోన్మెంటులో ప్రస్తుతం 3 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. ప్రస్తుతం 279 ప్రైవేట్ హౌసింగ్ కాలనీలు,లేఅవుట్లు, 13 గ్రామాలు, 16 నోటిఫైడ్ సివిల్/బజార్ ఏరియాలు ఉన్నాయి.రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పలు భూములున్నాయి.
కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడిగా ఆర్మీ బ్రిగేడియర్
కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడిగా ఆర్మీ బ్రిగేడియర్ ఎస్ఎం సోమశంకర్ వ్యవహరిస్తున్నారు. బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా మధుకర్ నాయక్, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా జె రామకృష్ణ ఉన్నారు. బోర్డు పరిధిలో ఏంచేయాలన్నా ఆర్మీ బ్రిగేడియర్ నిర్ణయిస్తున్నారు.
సివిల్ ఏరియాలు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తాం : డిఫెన్స్ సెక్రటరీ ఎ గిరిధర్
సికింద్రాబాద్ కంటోన్మెంటు పరిధిలోని సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ గిరిధర్ చెప్పారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారితో గిరిధర్ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. బ్రిటీషు పాలన నుంచి నేటి వరకు దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్ బర్డులను రద్దు చేయాలని కేంద్రప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున సికింద్రాబాద్ కంటోన్మెంటులోని సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీని గిరిధర్ కోరారు.
సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తాం : చీఫ్ సెక్రటరీ ఎ శాంతి కుమారి
సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపిందని ఆమె పేర్కొన్నారు. కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ లో త్వరితగతిన విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుందని ఆమె తెలిపారు. సివిల్ ఏరియాల తొలగింపు విధి విధానాలను ఖరారు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను ఇంకా ఇవ్వలేదని శాంతికుమారి చెప్పారు. విలీన ప్రక్రియను వేగిరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పనిచేస్తుందని తెలిపారు.
సివిల్ ఏరియాల అభివృద్ధికి నిధులివ్వండి : జే రామకృష్ణ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ మెంబర్ జే రామకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనలపై కాకుండా అభివృద్ధి పనులపై రాష్ట్రం దృష్టి సారించాలని కోరారు. కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ఏరియాలకు మంచినీటి సరఫరా చేయాలని వాటర్ బోర్డును ఆయన కోరారు. బోయినపల్లి, మడ్ ఫోర్టు, లోతుకుంట, కార్ఖానా పలు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. కంటోన్మెంట్ పరిధిలో రోడ్లు, మంచినీటి సరఫరాను మెరుగుపర్చాలని ఆయన కోరారు.