రికమండేషన్‌తో వచ్చేవారికి పనిష్మెంట్ పోస్టింగ్ : రేవంత్ సంచలన ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీర్లు రికమండేషన్‌తో వచ్చే వారికి పనిష్మెంట్ పోస్టింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖఅధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-09-26 14:05 GMT

ఇంజినీర్లు పని మీద శ్రద్ధ పెట్టాలని పోస్టింగ్ ల మీద కాదని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని సీఎం కోరారు.రికమండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పనిష్మెంట్ పోస్టింగ్ ఇవ్వాలని సీఎం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని సీఎం ఆదేశించారు.


క్షేత్రస్థాయిలో పని చేయండి
ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్తగా ఎంపికైన ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.‘‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు..ఫీల్డ్ విజిట్ చేశాకే రిపోర్టులు రాసే వారు..కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు..మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం’’అని సీఎం తెలిపారు.

వేగంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోందని సీఎం చెప్పారు. ‘‘నీటిపారుదల శాఖ ఏఈఈ మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం.తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది,ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి రైతులకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

జడ్పీటీసీ నుంచి సీఎం అయ్యాను...
ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారని, రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తున్నారని సీఎం చెప్పారు. తాను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారని సీఎం చెప్పారు.

కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి...
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.‘‘బ్యారేజ్ కూలడంలో ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి..అధికారులనా? రాజకీయ నాయకులనా? మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ’’ అని సీఎం చెప్పారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం సూచించారు.‘‘లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు..పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి..రూ.2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు..భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు’’ అని సీఎం కొత్త ఇంజినీర్లకు సూచించారు.


Tags:    

Similar News