తెలుగు నేతలు కోట్లు ఖర్చు చేస్తే, జెనాబెన్ చందాలతో గెలిచారు
కాంగ్రెస్ తరపున జెనాబెన్ ఠాకూర్ అనే మహిళా నేత పోటీచేసి గెలిచారు. జెనాబెన్ గెలవటమే గొప్పంటే గెలిచిన తీరు మరింత ఆశ్చర్యంగా ఉంది.
ఈ మధ్యనే ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో ఆస్తులు చూపించటంలో చాలామంది అభ్యర్ధులు పోటీపడ్డారు. దేశం మొత్తంమీద తెలుగురాష్ట్రాల్లో పోటీచేసిన అభ్యర్ధులే అత్యంత స్ధితిమంతులుగా పాపులరయ్యారు. ఏపీలో గుంటూరు పార్లమెంటు సీటులో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన పెమ్మసాని చంద్రశేఖర్ సంపద రు. 6 వేల కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. అఫిడవిట్లోనే రు. 6 వేల కోట్ల ఆస్తులు చూపించారంటే ఇక వాస్తవంగా ఎంతుంటుందో ఎవరికి వారుగా ఊహించుకోవాల్సిందే. అలాగే తెలంగాణాలో బీజేపీ తరపున చేవెళ్ళ సీటులో పోటీచేసిన కొండా విశ్వేశ్వరెడ్డి ఆస్తులు 4,568 కోట్ల రూపాయలు. వీళ్ళతో పోల్చితే జెనాబెన్ ఆస్తులు అసలు ఆస్తులే కావు.
విషయం ఏమిటంటే గుజరాత్ లోని బెనస్కాంత పార్లమెంటు నియోజకవర్గముంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక నియోజకవర్గం బెనస్కాంతనే. ఇక్కడే బెనస్కాంత నియోజకవర్గం చరిత్రకెక్కింది. గుజరాత్ లో ఏమూల చూసినా బీజేపీదే కదా ఆధిక్యత. గడచిన 30 ఏళ్ళుగా కాంగ్రెస్ గుజరాత్ లో అధికారానికి దూరంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో బెనస్కాంతలో కాంగ్రెస్ గెలవటం అదికూడా ఒక మహిళ కావటం ఇంకా సంచలనమైంది. బెనస్కాంత నియోజకవర్గంలో గడచిన మూడు ఎన్నికల్లో బీజేపీదే సంపూర్ణ ఆధిపత్యం. ఇలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున జెనాబెన్ ఠాకూర్ అనే మహిళా నేత పోటీచేసి గెలిచారు. జెనాబెన్ గెలవటమే గొప్పంటే గెలిచిన తీరు మరింత ఆశ్చర్యంగా ఉంది. అవతల బీజేపీ తరపున పోటీచేసిన రేఖాభాయ్ హితేష్ భాయ్ చౌధరి ఆర్ధిక, అంగబలాల్లో గట్టి అభ్యర్ధి. కాంగ్రెస్ అభ్యర్ధి జెనాబెన్ ఏమో ఆర్ధికంగా ఎందుకూ పనికిరాదు.
అయినా సరే ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో బలమైన ప్రత్యర్ధిని జెనాబెన్ గెలిచింది. బలమైన ప్రత్యర్ధిని ఢీకొట్టి జెనాబెన్ ఎలా గెలిచిందన్నదే స్పూర్తిపాఠం. పంచాయితీ ఎన్నికల ద్వారా జెనాబెన్ 20 ఏళ్ళ క్రితం ప్రజాజీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటినుండి సమస్యలు, వాటి పరిష్కారం కోసం జనాల్లోనే తిరుగుతున్నది. ఎప్పుడూ జనాలమధ్యే తిరగటం వల్ల ప్రజానేత అనిపించుకున్నది. ఎన్నికలకు జెనాబెన్ కొత్తేమీకాదు. గుజరాత్ లోని వావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2012లో పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2017, 2022లో కూడా ఎంఎల్ఏగా గెలిచారు. ఎంఎల్ఏ హోదాలోనే ఎంపీగా మొదటిసారి పోటీచేసి గెలిచారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల్లో ఖర్చుపెట్టడానికి జెనాబెన్ దగ్గర డబ్బులు పెద్దగా లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్ చేసింది. దాంతో పార్టీ తరపున అభ్యర్ధులకు ముఖ్యంగా గుజరాత్ లో పోటీచేసిన చాలామందికి నిధులు అందలేదు. జెనాబెన్ దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలుసుకుని జనాలే స్వచ్చంధంగా జెనాబెన్ ఎన్నికల ఖర్చులను భరించారు. అభ్యర్ధి కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత మొత్తాన్ని కలెక్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన మొత్తం 2 వేల పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా పనిచేసిన వారి ఖర్చులకే సరిపోయింది. మరి మిగిలిన ఖర్చుల మాటేమిటి ? ఏమిటంటే ఏ ఊరికి ఆ ఊరులోని జనాలే జెనాబెన్ ఎన్నికల ఖర్చులకు తలాఇంతని వేసుకున్నారు. కొద్దిమొత్తాలను పోగుచేసి ఊరిజనాలే జెనాబెన్ కోసం ప్రచారం చేశారు. ఊర్లలోని చాలామంది తమ ఊరివాళ్ళే పోటీచేస్తున్నట్లుగా, తమ కుటుంబంలోని వ్యక్తే పోటీచేస్తున్నట్లుగా కమిట్మెంట్ తో జెనాబెన్ కోసం ఎన్నికల్లో పనిచేశారు. అంతమంది స్వచ్చంధంగా నిధులిచ్చి, ఎన్నికల్లో ప్రచారంచేస్తే చివరకు జెనాబెన్ 30 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు.
జెనాబెన్ ఠాకూర్ కు 6, 71,883 ఓట్లు వస్తే ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి రేఖాబెన్ హితేష్ భాయ్ చౌధరికి 6,41,477 ఓట్లొచ్చాయి. ఇపుడు చెప్పింది వందలు, వేల కోట్ల రూపాయల ఆస్తులున్న అభ్యర్ధులు జెనాబెన్ ముందు ఎందుకైనా పనికొస్తారా ? ఎన్నికల్లో గెలవటానికి మనకు తెలిసింది అభ్యర్ధులు కోట్లరూపాయలను మంచినీళ్ళు లాగ ఖర్చు చేయటమే. మరి జెనాబెన్ వ్యవహారంలో జనాలే ఎదురిచ్చి, ఎన్నికల ఖర్చులను పెట్టుకుని ఆమెను గెలిపించుకున్నారు. వందలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని జెనాబెన్ గెలుపు దేశానికి చాటిచెప్పింది.