తెలంగాణలో ఇఫ్తార్ విందులకు నిధులు విడుదల
తెలంగాణలో ఇఫ్తార్ విందుల పేరిట నిధులు వ్యర్థం చేయవద్దని ముస్లిం ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ 448 మసీదులకు నిధులు విడుదల చేసింది.;
By : Shaik Saleem
Update: 2025-03-21 10:44 GMT
తెలంగాణ రాష్ట్రంలో రమజాన్ మాసంలో ఇఫ్తార్ విందుల పేరిట ప్రభుత్వ డబ్బును వృథా చేయవద్దని, ఆ డబ్బును ముస్లింల అభ్యున్నతి కోసం కేటాయించాలని డిమాండ్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.ముస్లిం ప్రజాసంఘాల డిమాండ్లను గాలికొదిలి ఒక్కో మసీదుకు లక్ష రూపాయల చొప్పున 448 మసీదు కమిటీలకు తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి నిధులను కేటాయించింది.
ఇఫ్తార్ విందులకు సర్కారు నిధులు
హైదరాబాద్ నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు రెండు మసీదులు చొప్పున 300 మసీదులకు నిధులు విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు మసీదుల చొప్పున 24 అసెంబ్లీ సెగ్మెంట్లలోని 96 మసీదులకు నిధులు ఇచ్చారు. దీంతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంటు పరిధిలోని 8 వార్డుల్లో వార్డుకు రెండు మసీదుల చొప్పున 16 మసీదులకు నిధులు కేటాయించారు. 19 అనాథలు, షియా, మహమ్మదీయ మసీదులకు కూడా ఇఫ్తార్ దావత్ నిధులు కేటాయించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎమ్మెల్యేలు,కార్పోరేటర్లను సంప్రదించి మసీదు కమిటీలను ఎంపిక చేసి నిధులు ఇచ్చారు.
సీఎం ఇఫ్తార్ విందును బహిష్కరిస్తాం : వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి రూ.70 కోట్ల బడ్జెట్‌ను ఇఫ్తార్ విందుల పేరిట వృథా చేయకుండా విద్యరంగానికి మళ్లించాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు సయ్యద్ కమల్ అథర్, ప్రధాన కార్యదర్శి న్యాయవాది మొహమ్మద్ వసీం లు డిమాండ్ చేశారు.ఇఫ్తార్ పేరిట సర్కారు నిధులను వృథా చేస్తున్నందున హైదరాబాద్‌కు చెందిన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు రాష్ట్ర ఇఫ్తార్ విందును బహిష్కరించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం, తెలంగాణ మంత్రివర్గంలో ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఇఫ్తార్ విందును బహిష్కరించాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా (డబ్ల్యుపిఐ) పిలుపునిచ్చింది.
తెలంగాణ మంత్రివర్గంలో ప్రాతినిథ్యమేది?
తెలంగాణ కేబినెట్‌లో ముస్లిం మంత్రి లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సమాజాభివృద్ధిని విస్మరించిందని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు ఆరోపించారు.గత 18 నెలలుగా మైనారిటీ కమిషన్ కు చైర్మన్ లేరని, ముఖ్యమైన మైనారిటీ సంక్షేమ సంస్థలు నాయకత్వం లేకుండా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల కీలక ముస్లింల సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుందన్నారు. ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని, తెలంగాణలో ముస్లింలపై దాడులు, హింస పెరిగినా ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు.నిజమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తూ ఇఫ్తార్ నిర్వహించడం ముస్లిం సమాజ ఆకాంక్షలకు అవమానమని మొహమ్మద్ వసీం ఆరోపించారు.
ఇఫ్తార్ విందులను రద్దు చేయండి
ఇఫ్తార్ విందులను రద్దు చేయాలని, ఆ డబ్బును మైనారిటీల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించాలని యునైటెడ్ సిటిజన్స్ ఫోరం ముస్లిం ఉలేమా కోరింది. ఇస్లామిక్ ఇఫ్తార్ నిరాడంబరమైన పద్ధతులతో జరగాలని ఫోరం పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలకు ప్రతికూలంగా ఉండే 'ఇఫ్తార్' పేరుతో విందులు నిర్వహించడం తగదని ఫోరం పేర్కొంది. దావత్ ఇఫ్తార్ను రద్దు చేసి, ఆ నిధులను ముస్లింల విద్య,ఉపాధి,సాధికారతకు కేటాయించాలని తెలంగాణ ముస్లింలు డిమాండ్ చేశారు.