సీఎస్ఆర్ నిధులతో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు

కలెక్టర్లు ప్రజోపయోగ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం కలెక్టర్ ‘మా ఇంటి మణి దీపం’ ఆదిలాబాద్ కలెక్టర్ ఉచితంగా శానిటరీ నాప్కిన్ల పంపిణీ చేపట్టారు..;

Update: 2025-03-27 04:44 GMT

తెలంగాణలోని జిల్లా కలెక్టర్లు ప్రజోపయోగ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ‘మా ఇంటి మణిదీపం’ పేరిట ఆడపిల్ల పుడితే పండుగ చేసుకోవాలని కోరుతూ జిల్లాలో ఆడపిల్లలు పుట్టిన 20 మంది తల్లులను ఖమ్మం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ మిఠాయి బాక్స్, పండ్లు, చిన్నారికి నూతన దుస్తులు అందించి తల్లిని శాలువతో సత్కరించారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఢిల్లీ నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పింకి షీ ఫౌండేషన్ నుంచి నిధులు తీసుకువచ్చి ఆదిలాబాద్ విద్యాసంస్థల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేపట్టారు.

బాలికల ఆరోగ్యం కోసం...
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆరోగ్యం కోసం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే వారు చదువుపై దృష్టి సారించగలరనే భావనతో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు.ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలుర కంటే బాలికల సంఖ్య అధికంగా ఉన్నారు.వారి కోసం ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. బాలికల్లో పరిశుభ్రత, వ్యాధుల నివారణ కోసం పేద బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ చేపట్టారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు
బాలికల కోసం ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించే కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా దీని కోసం న్యూఢిల్లీ నుంచి నిధులు మంజూరు చేయించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఢిల్లీకి చెందిన పింకిషీ ఫౌండేషన్ ను ఒప్పించి ఆ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించే కార్యక్రమాన్ని ఏప్రిల్ నెల నుంచి చేపట్టనున్నారు. కలెక్టర్ రాజర్షి షా పింకిషీ ఫౌండేషన్ ప్రతినిధులతో మాట్లాడి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేసేందుకు సమాయత్తం చేశారు.

ఎన్ని విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం అమలు అంటే...
బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించేందుకు ఆదిలాబాద్ జిల్లాలోని ఏడు జూనియర్ కళాశాలలు, 17 కస్తుర్బా పాఠశాలలు,మరో 16 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను న్యూఢిల్లీకి చెందిన పింకిషీ ఫౌండేషన్ ఎంపిక చేసింది.ఆదిలాబాద్, ఉట్నూర్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, బేల ప్రాంతాల్లోని కళాశాలలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు.జిల్లాలో 9,855 మంది విద్యార్థులకు శానిటరీ న్యాప్కిన్లు అందించాలని నిర్ణయించారు. 33 పాఠశాలలకు చెందిన 7,784 మంది బాలికలు, ఏడు కళాశాలల్లోని 2,071 మంది బాలికలకు ఏప్రిల్ నెల నుంచి ఉచితంగగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

విద్యార్థులకు పౌష్ఠికాహారం

అదిలాబాద్ జిల్లాలో చించు ఘాట్ నిర్మాణ్,సర్వీస్ నౌ సంస్థ దత్తత తీసుకున్న గ్రామంలోని పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పోషణ్ చర్చా న్యూట్రిషియస్ ప్రోగ్రాం కింద పౌష్ఠికాహారాన్ని అందించారు.గవర్నర్ దత్తత తీసుకున్న అదిలాబాద్ రూరల్ బుర్కీ గ్రామం లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు యూనిఫాం అందజేశారు.

Tags:    

Similar News