పశువుల పెంపకందారులకు ఉచితంగా పశుగ్రాస విత్తనాలు
తెలంగాణలోని పశువుల పెంపకందారులకు ఉచితంగా పశుగ్రాస విత్తనాలు అందించాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది.దీని కోసం ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
By : Shaik Saleem
Update: 2024-11-12 13:39 GMT
రాష్ట్రంలోని పశువుల పెంపకందారులు కోరుకునే విధంగా ఉచిత పశుగ్రాస విత్తనాలను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,డెయిరీ డెవలప్‌మెంట్ ఫిషరీస్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ వెల్లడించారు. రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేయాలని సబ్యసాచి ఘోష్ అధికారులను ఆదేశించారు.
- పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లో జిల్లా వెటర్నరీ అధికారులతో నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకం రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.
- తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ఇతర ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టులను పరిశీలించి తదనుగుణంగా నివేదికను సమర్పించాలని కార్యదర్శి ఆదేశించారు.
మేకలు, పౌల్ట్రీ ప్రాజెక్టులకు రుణాలు
పశుసంవర్ధక శాఖ అధికారుల సమావేశంలో 67 గొర్రెలు, మేకల ప్రాజెక్టులు,మూడు పౌల్ట్రీ ప్రాజెక్టులకు రుణాలు అందించడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయని సబ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 412 ప్రాజెక్టులకు నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధి కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. క్షేత్ర స్థాయి అధికారులు వివరాలు సేకరించి, కేంద్ర స్థాయిలో మంజూరుకు ప్రాజెక్టులను సిఫార్సు చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ సూచన మేరకు, కేంద్ర స్థాయి కమిటీ వాటిని పరిశీలించి ఆమోదం పొందిన తర్వాతే ప్రాజెక్టులను ప్రారంభించాలని కార్యదర్శి సూచించారు. ఆయా పథకాలకే సబ్సిడీ అందేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు సూచించారు.