‘సీఎం రేవంత్ రెడ్డి అందులోనే నెంబర్ వన్’.. మాజీ ఎంపీ చురకలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పంచులు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తిరోగమనం చెందుతుందని విమర్శించారు.

Update: 2024-10-10 12:42 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పంచులు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తిరోగమనం చెందుతుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్కెటింగ్‌లో నెంబర్‌వన్ అని, అందులో ఆయనకు పడగొట్టే వ్యక్తి ఎవరూ లేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒక్కసారి కూడా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదని విమర్శించారు. ఈ సందర్బంగానే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలో వచ్చిన తర్వాత వాళ్లను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలో లేనంత వరకు ప్రజలు ప్రజలు అంటూ తిరిగిన కాంగ్రెస్ నేతలు అధికారం వచ్చిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని, ఆఖరికి టీపీసీసీ చీఫ్.. సీఎంకు నోటిఫై చేసి సీఎం ఆదేశిస్తే గానీ మంత్రులు గాంధీభవన్‌ గడప తొక్కడం లేదని ప్రజావాణికి మంత్రులు హాజరుకావడంపై చురకలంటించారు. తెలంగాణ ఉద్యమకారుల గుండెకు గన్నులు గురిపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనంటూ గతాన్ని గుర్తు చేశారాయన.

కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా!

ఈ సందర్బంగానే కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కూడా కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చరిత్ర తనకుందని చెప్పారు. ఆ సమయంలో తనకెవరూ ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ‘‘నేనో తెలంగాణ వాదిని. ఏం చేసినా తెలంగాణ బాగు కోరుకునేవాడిని. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఇదే విషయాన్ని గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఎన్నికలు ప్రచారంలో కల్లబొల్లి కబుర్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ నాటికి 2 లక్సల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. కానీ చేశారా? కేసీఆర్ ప్రభుత్వం 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ రంగాల్లో ఉన్న ఖాళీలను గుర్తించే బాధ్యతను ఎమ్మెల్సీ కోదండరాం తీసుకోవాలని మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

మంత్రులకు ఆ విషయం కూడా తెలీదు..

రాష్ట్రంలో ఉద్యోగా నియామక ప్రక్రియ ఎలా జరుగుతుందో కూడా మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌కు తెలియదని ఆయన విమర్శలు వర్షం కురిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో 1,62,572 మందికి ఉద్యోగాలు అందించామని ఆయన వెల్లడించారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలకే ఇప్పుడు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నింపిన ఉద్యోగాల సమాచారం మంత్రులకే తెలియకపోవడం మన దౌర్భాగ్యం. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు. చేసిన పనికి ప్రచారం చేసుకోవడం చేతకాకనే బీఆర్ఎస్ నష్టపోయింది’’ అని కాంగ్రెస్ సర్కార్‌కు చేరకలంటించారు.

Tags:    

Similar News