నేతలను చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు రాని మాజీ ఎమ్మెల్యేకు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులే జైలు బాట పట్టగా తాజాగా ఈ జాబితాలోకి ఇప్పుడు రాజకీయ నేతలు కూడా చేరనున్నట్లు కనిపిస్తోంది.

Update: 2024-11-11 11:22 GMT

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో అధికారులే జైలు బాట పట్టగా తాజాగా ఈ జాబితాలోకి ఇప్పుడు రాజకీయ నేతలు కూడా చేరనున్నట్లు కనిపిస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు సమన్లు జారీ చేయడమే ఇందుకు కారణం. ఈరోజే జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌కు రావాలంటే లింగయ్యకు పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. రాజకీయ నాయకులకు నోటీసులు జారీ కావడం మొదలు కావడంతో తర్వాత నోటీసులు ఎవరు అందుకోనున్నారో అన్న చర్చలకు కూడా మొదలయ్యాయి.


పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిరుమర్తి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన కారణంగానే నోటీసులు జారీ చేశామని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. తన ప్రత్యర్థుల ఫోన్‌లను ట్యాప్ చేసి వారిపై నిఘా ఉంచారని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. ఆయన విచారణకు హాజరైతే ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని, 14వ తేదీన విచారణకు వస్తానని పోలీసులకు మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు సమాచారం.

రాజకీయంగా మొదలైన ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్.. దీని వెనక ఎవరున్నా, ఎంతటి వారున్నా వదిలేది లేదని ఇప్పటికే పలుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు ఈ కేసులో అరెస్ట్ కాగా.. అతి త్వరలోనే రాజకీయ నాయకులు కూడా కటకటాల పాలు కానున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు అంటూనే ఉన్నారు. ఈ క్రమంలో చిరుమర్తికి నోటీసులు రావడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. దీంతో ఇంకా ఈ కేసులో ఎవరెవరి పేర్లు బయటకి వస్తాయి అన్న చర్చ ప్రజల్లో పెరుగుతోంది. నిజంగానే మంత్రి పొంగులేటి చెప్పినట్లుగా రాజకీయ బాంబులు పేలనున్నాయా? పొంగులేటి చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కేసు గురించేనా? మరేమైనా కేసులు ఉన్నాయా? అనే చర్చ తెలంగాణలో జోరందుకుంది.

ఇప్పటి వరకు వీరే అరెస్ట్..

ఈ కేసులో ఏ1గా ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు, డీఎస్పీ ప్రణీత్ రావు, ఏ3గా ఉన్న రిటైర్డ్ అదనపు ఎస్పీ రాధాకిషన్ రావు, ఏ4గా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ఏ4, రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల్, ఏ5గా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న, గట్టుమల్లు భూపతి అరెస్ట్ అయి ఉన్నారు. ప్రభాకర రావు ఒక్కరే విదేశాల్లో ఉన్నారు. వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు, సినిమా, వ్యాపార ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్ రావు అరెస్ట్లో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేక బృందంతో విచారణ జరిపించింది. ఈ కేసును విచారించే కొద్ది కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని నిర్ధారించారు పోలీసులు. రేపో మాపో పొలిటికల్ లీడర్స్కి కూడా నోటీసులు అందజేస్తారనే ప్రచారం జరిగింది.

Tags:    

Similar News