Formula E Car Race | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణ
ఫార్ములా ఇ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణ జరపాలని నిర్ణయించారు. ఫార్ములా-ఈ రేస్‌లో కంపెనీకి చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.;
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అవినీతి నిరోధక శాఖకు లేఖ రాశారు.హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేస్‌లో కంపెనీకి చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులకు సూచించారు.
- అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై చర్యలు ప్రారంభం కానున్నాయి.సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కేసును దర్యాప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ద్వారా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి లేఖ రాయాలని నిర్ణయించారు. దీంతో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
- ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన దర్యాప్తును మరింతగా కొనసాగించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపిన విషయాన్ని ముఖ్యమంత్రి మంత్రివర్గానికి వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఎంఏ అండ్ యూడీ మాజీ సెక్రటరీ అరవింద్ కుమార్‌పై విచారణకు ప్రధాన కార్యదర్శి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏజెన్సీలపై చర్యలు
అసెంబ్లీ కమిటీ హాల్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ముందుగా ముగ్గురు లేదా నలుగురిపై విచారణ జరుపుతామన్నారు. ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించిన కొన్ని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని, అక్కడ భారీగా డబ్బు చేతులు మారిందని చెప్పారు.“ఏసీబీ ముందు నిందితులు సమాధానం చెప్పాలి. జైలుకు వెళ్లిన తర్వాత మోకాళ్లపై పాదయాత్ర చేయాలన్నా, యాత్ర చేయాలన్నా వారికే వదిలేస్తాం’’ అని కేటీఆర్ ను ఉద్ధేశించి పొంగులేటి వ్యాఖ్యానించారు.
రూ.55 కోట్ల బదిలీ
ఫార్ములా-ఈ రేస్‌లో అవసరమైన విధానాలను తుంగలో తొక్కి కంపెనీకి రూ.55 కోట్లను బదిలీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. రేసు జరిగినప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు.ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ పై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. కేటీఆర్ విచారణకు ముందుకు వెళ్లాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ పై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇచ్చారు
ఐఎఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు చీఫ్ సెక్రటరీ అనుమతి ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఏసీబీ ద్వారా కేసు నమోదు అయింది.దీనిపై విచారణ అనుమతి లేఖ ఈ రాత్రికి చీఫ్ సెక్రెటరీ ద్వారా ఏసీబీకి వెళుతుందని అసెంబ్లీ కమిటీ హాల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్ సందర్భంగా చెప్పారు.