మాజీ మంత్రి హరీష్ రావుకు ఎందుకు నిద్ర రావట్లేదు?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే చెప్తున్నాయి.

Update: 2024-09-27 10:12 GMT

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే చెప్తున్నాయి. రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు పడుతున్న కష్టాలను చూసి కలత చెందే.. హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని, వారికి న్యాయం అందించే వరకు పోరాడాలని ఆయన నిశ్చయించుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో మరోసారి రైతు రుణమాఫీ వివాదం చెలరేగింది. ఎన్నికల సమయంలో చెప్పిన రుణమాఫీ హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఘంటాపథంగా విమర్శిస్తున్నాయి. ప్రతి రైతుకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు రైతుల పాలిట ఉరితాడులా మారుతోందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మండిపడ్డారు. రైతులందరికీ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేసేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేసేవరకు తాము ధర్నా విరమించమని వెల్లడించారు. రైతుల రుణమాఫీతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ సాధించేవరకు తమ పోరాటం ఆగదని, రైతులకు న్యాయం అందించడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు రాబట్టుకోవడం కోసం ఇష్టానుసారంగా ప్రజలకు హామీలు ఇచ్చారాని, తీరా అధికారం వచ్చిన తర్వాత అన్ని అరాకొరగా చేసి చేతులు దులుపుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం కొందరికి మాత్రమే చేసి.. మిగిలిన వారికి మొండిచేయి చూపుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌కు నిద్ర లేకుండా చేస్తా..

‘‘ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చేస్తాం. అది సాధించే వరకు నేను నిద్రపోను. రేవంత్ రెడ్డిని కూడా నిద్రపోనివ్వను. అన్నం పెట్టే రైతులను మోసం చేయడం ఎంత వరకు సమంజసం కాదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు నాట్లు వేసే సమయంలోనే రైతుబంధు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పంట కోతలకు వచ్చినా ఇంకా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కడుపు నిండా కరెంట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాత్రి సమయంలో కరెంటు ఇస్తుంది’’ అని మండిపడ్డారు. కేటీఆర్ పాలనలో 24 గంటలు కరెంటు ఉంది. కరోనా సమయంలో కూడా సమయానికి రైతు బంధు అందించామని ఆయన చెప్పుకొచ్చారు.

రైతులను నట్టేట ముంచారు..

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురువుతున్నాయి. ఈ వానాకాలం ఇస్తామన్న రూ.7500 లేదు, గతంలో ఇచ్చిన రూ.5000 లేదు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను అప్పుల పాలు చేస్తున్నారు. ఏంటని అడిగితే కుంటిసాకులు, అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నారు. కేసీఆర్ తన పాలనలో 11 సార్లు రైతుబంధును చెప్పిన సమయానికే ఇచ్చారు. వడ్లు కొన్న సమయాల్లో కూడా మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. తెలంగాణ రైతు విలువ, రతు భూమి విలువను పెంచిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రంలోకి కాంగ్రెస్ వచ్చింది రైతు విలువ, రైతు భూమి విలువ రెండూ అధఃపాతాళానికి చేరాయి. కాంగ్రెస్‌తో రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ జరిగిన మేలు ఒక్కటి కూడా లేదు’’ అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి.

సన్నాయి నొక్కుల్లొద్దు

ఎన్నికల సమయంలో రెండు లక్షల మాఫీ, వడ్లకు బోనస్ అని చెప్పిన రేవంత్ ఇప్పుడు మాటెందుకు మారుస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి రాకముందు వడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన వీళ్లు ఇప్పుడు సన్నాలకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోసన్ ఇస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. ఇప్పుడు సన్నాలకే అంటూ నాలుక మడతబెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన తొలి సంతకం రైతు రుణమాఫీపైనే అన్నావు కదా రేవంత్.. అది ఏమైంది. అసలుకే ఎసరు పెట్టి రైతులను మోసం చేస్తివి’’ అని అన్నారు.

సవాల్‌కు సై అంటివి కదా.. ఏమాయే రేవంత్..

‘‘రైతులకు చెప్పినట్లుగా పూర్తి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నా. నాకు నా పదవి, అధికారం కన్నా రైతుల సంక్షేమమే ముఖ్యం. సవాల్‌కు సై అంటివి.. మరి ఏమైంది. చెప్పినట్లు ఆగస్టు 15కు రుణమాఫీ చేసి ఉంటేనే ఇప్పుడు నీపై నిరసనకు ఇంతమంది వచ్చేటొళ్లా..? రుణమాఫీ మొత్తం రూ.31 వేల కోట్ల నుంచి రూ.18వేల కోట్లకు వచ్చింది. రుణమాఫీ అయిన రైతులు తక్కువ మంది.. కానోళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వం వెంట పడతా. హైదరాబాద్‌లో కూర్చుని మస్తు మాటలు చెప్తూ.. ఎనుముల రేవంత్ రెడ్డి కాస్తా ఎగవేత రేవంత్ రెడ్డి అయ్యారు. పండగ లోపు రైతు రుణమాఫీ పూర్తి కావాలే.. లేకుంటే రైతులంతా కలిసి హైదరాబాద్ సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం’’ అని హెచ్చరించారు హరీష్ రావు.

పూర్తి రుణమాఫీ జరగలేదు: ఉత్తమ్

అయితే రైతులకు రుణమాఫీ పూర్తిగా కాలేదని రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. రుణమాఫీ పూర్తిగా కాలేదని అంగీకరించారు. అందుకు కారణాలను కూడా ఆయన వివరించారు. "అవును నిజమే మేము రుణమాఫీ పూర్తిగా చేయలేదు.. ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదు.1.20 లక్షల మందికి ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము. 1.61 లక్షల మందికి ఆధార్ కార్డు, లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి. 1.50 లక్షల అకౌంట్లలలో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. 4.83 వేల మందికి రేషన్ కార్డులు లేవు. 8 లక్షల మందికి 2 లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మండల వ్యవసాయ అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News