ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్

దేశంలోనే ఆహార కల్తీలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలిచిందనే నేషనల్ క్రైం రికార్డు బ్యూరో నివేదికలతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల్లో కదలిక వచ్చింది.

Update: 2024-06-19 14:45 GMT

హైదరాబాద్ నగరంలో మొన్నటి దాకా హోటళ్లు,ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలపై దాడులు చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తాజాగా హాస్టళ్లు, పీజీలపై దృష్టి సారించారు. హోటళ్లు, హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తోంది.

- హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీని నిరోధించి హోటళ్లలో పరిశుభ్రవాతావరణం కల్పించడానికి ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డి.రోనాల్డ్ రోస్ లు ఏర్పాటు చేశారు.
- ప్రతీ రోజూ ఉదయం పదిన్నర గంటలకు ఫుట్ ఇన్ స్పెక్టర్లతో కూడిన టాస్క్ ఫోర్స్ అధికారులు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సిద్ధంగా ఉంటారు. ఇద్దరు కమిషనర్లు మాట్లాడుకొని ఏ ప్రాంతంలో తనిఖీలు చేయాలో ముందుగా వారికి సమాచారం ఇస్తారు. అక్కడికి చేరుకున్నాక ఆ ప్రాంతంలోని హోటళ్లు, హాస్టళ్లు, బేకరీలను గుర్తించి వాటి పేర్లు చెప్పి అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేపిస్తున్నారు.
- ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీల విషయం అత్యంత రహస్యంగా ఉంచుతారు. తనిఖీలు జరిపిన ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లకు పలు లోపాలు దృష్టికి వచ్చాయి. దీంతో వారికి నోటీసులు జారీ చేశారు.

తనిఖీల్లో వెలుగుచూసిన అపరిశుభ్రత
హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ 90 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపింది. పలు హోటళ్లు, హాస్టళ్లలో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని అధికారుల తనిఖీల్లో తేలింది. నగరంలోని పెద్ద హోటళ్లలోనూ నిబంధనలు పాటించలేదని వెల్లడైంది. దీంతో 90 హోటళ్లకు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు నోటీసులు జారీ చేశారు.

తనిఖీలతో హోటళ్లలో మెరుగుపడిన పరిస్థితులు : ఫుడ్ సేఫ్టీ అధికారి బాలాజీరావు
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలతో హోటళ్లలో పరిస్థితులు మెరుగుపడ్డాయని హైదరాబాద్ నగర ఫుడ్ సేఫ్టీ విభాగం ముఖ్య అధికారి బాలాజీరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గత రెండు నెలలుగా పలు హోటళ్లలో తనిఖీలు చేసి నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేయడంతో పరిస్థితులు మారాయని ఆయన పేర్కొన్నారు.

స్ట్రీట్ ఫుడ్ వెండర్సుపై కూడా దాడులు
హైదరాబాద్ నగరంలో 20వేలకు పైగా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారని, వాటిపై కూడా దృష్టి సారించి అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఫుడ్ సేఫ్టీ ముఖ్య అధికారి బాలాజీరావు చెప్పారు. తాము తనిఖీలు చేయడమే కాకుండా హోటళు, రెస్టారెంట్ల సిబ్బందికి, స్ట్రీట్ ఫుడ్ వెండర్సుకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నామని బాలాజీరావు చెప్పారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎప్రాన్స్, క్యాప్స్, గ్లౌజులు ధరించాలని తాము ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.

బడా హోటళ్లు, రెస్టారెంట్లలోనూ నిబంధనల ఉల్లంఘన
హైదరాబాద్ నగరంలోని బడా హోళళ్లు, రెస్టారెంట్లలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. ఏఎస్ రావునగర్ లోని బార్బీక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయని, లేబుల్ లేని ఆహారపదార్థాలను ఉపయోగిస్తున్నారని వెల్లడైంది. లక్టీకాపూల్ లోని అశోకా హోటల్ లో కాలం చెల్లిన సరకులు వాడుతున్నారని తేలింది. ఇలా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన బడా హోటళ్లలో శ్రీ ఇంటర్నేషనల్ ఫిష్ ల్యాండ్, బ్లూ టోకార్ కాఫీ రోస్టర్స్, చైనా బ్రిస్టో, కేఎఫ్ సీ, షాగోస్, రాయలసీమ రుచులు, కామత్ హోటల్, సుఖసాగర్, అథెంటిక్ అరోమా ఫైవ్ స్టార్ హోటల్, గోకుల్ ఛాట్ లోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తనిఖీల్లో తేలింది.

అధ్వానంగా హాస్టళ్లు
హైదరాబాద్‌లోని హాస్టళ్లు,పీజీలు,రెస్టారెంట్లపై జరిపిన దాడుల్లో పలు ఆహార భద్రత, పరిశుభ్రత ఉల్లంఘనలు అధికారులు కనుగొన్నారు.మాదాపూర్ ప్రాంతంలోని హాస్టళ్లు,పేయింగ్ గెస్ట్ హాస్టళ్లను తెలంగాణ ఆహార భద్రతా శాఖ తనిఖీలు చేసింది.కావూరి హిల్స్‌లోని శ్రీ లక్ష్మి పీజీ హాస్టల్‌లో ఎలాంటి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తుప్పు పట్టిన దోసె పాన్
తెలంగాణలోని టొమాటో సాస్ తయారీ యూనిట్లను తనిఖీ చేయగా అందులో పలు లోపాలు కనిపించాయి.తెగులు సోకిన కాలీఫ్లవర్, బెండకాయలను వినియోగిస్తున్నట్లు హాస్టళ్లలో వెల్లడైంది.దోసె పాన్ తుప్పు పట్టినట్లు గుర్తించారు. పని ప్రదేశం అపరిశుభ్రంగా ఉందని గమనించారు.కల్తీ లూజ్ కారం పొడి, కందిపప్పు నమూనాలను అధికారులు సేకరించి పరీక్షకు పంపించారు.హాస్టళ్ల ఆహారంలో రంగులు వాడుతున్నారని వెల్లడైంది. అపరిశుభ్రమైన స్థితిలో రిఫ్రిజిరేటర్ ఉంది.తాగునీరు, వెనిగర్, చిల్లీ సాస్, టొమాటో సాస్ నమూనాలను పరీక్షకు పంపించారు.


Tags:    

Similar News