రైతుకి ఆలస్యమవుతోన్న 'భరోసా'

రైతు భరోసా కోసం రాష్ట్రంలోని రైతుల నిరీక్షణ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.

By :  Vanaja
Update: 2024-07-24 14:21 GMT

రైతు భరోసా కోసం రాష్ట్రంలోని రైతుల నిరీక్షణ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఆగస్టు నెలాఖరులోగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన తర్వాతే పథకానికి సంబంధించిన ముసాయిదా ఖరారు అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సూచనప్రాయంగా తెలిపారు.

బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ... రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పథకం అమలు కోసం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు క్యాబినెట్ సబ్‌ కమిటీ ప్రస్తుతం రైతులు, నిపుణులు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ‘‘రైతు రుణమాఫీని ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మేము కూడా ఉభయ శాసనసభలలో చర్చలు జరుపుతాము. రైతు భరోసా కోసం అర్హత ప్రమాణాలతో సహా కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసే ముందు సభ్యులందరి నుండి సలహాలను తీసుకుంటాము” అని తుమ్మల వెల్లడించారు.

ఆలస్యంపై ఆగ్రహం...

రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం... రైతులు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా నిరోధించడానికి, వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రూపొందించబడిందని గుర్తు చేశారు. రైతు భరోసా ఫ్రేమ్‌వర్క్ పూర్తయ్యే లోపు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. "అనర్హులను తొలగించడానికి మేము వ్యతిరేకం కాదు, అయితే తాజా మార్గదర్శకాలను రూపొందించడం, కొత్త లబ్ధిదారులను గుర్తించడం పేరుతో పంపిణీలో జాప్యం చేయడం వల్ల నిరుపేద రైతులు ఇబ్బందులు పడకూడదు" అనేదే మా తాపత్రయం అని తాతా మధు స్పష్టం చేశారు.

ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వరి నాట్లు ప్రారంభమయ్యాయని, రైతు భరోసా పంపిణీలో మరింత ఆలస్యం చేయడం వల్ల రైతులకు ఆర్ధికంగా నష్టం జరుగుతుందన్నారు. రైతులు ఇప్పటికే వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారని, రైతు భరోసా నిధులు సకాలంలో విడుదల చేస్తే వారికి ఆర్ధిక ఇబ్బందులు ఉండవు అని ప్రభుత్వానికి సూచించారు.

Tags:    

Similar News