నకిలీ ఆధార్, ఓటరు కార్డుల ముఠా గుట్టు రట్టు

సికింద్రాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్, ఓటరుకార్డుల ముఠా గుట్టును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ రట్టు చేసింది.నకిలీ కార్డులను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.

Update: 2024-11-14 14:45 GMT

సికింద్రాబాద్ కలాసీగూడకు చెందిన యెల్లం రాజ్ కుమార్ అతని సిబ్బంది రాచమల్ల విజయలక్ష్మీ, కూరపాటి పల్లవి ఇతరుల సహాయంతో పదేళ్లుగా పాట్నీలోని శ్రీనాథ్ కాంప్లెక్సులోని ఆర్ఎస్ ఆన్ లైన్ సేవా కేంద్రాన్ని నడుపుతున్నాడు.

- డెస్క్ టాప్ అప్లికేషన్ మ్యాజికల్/యూనివర్సల్ ఐడీ అండ్ ప్రింటింగ్ టూల్ ద్వారా ఓటర్ ఐడీ, ఆధార్, పాన్ కార్డ్ వంటి నకిలీ ఐడీలను సృష్టించేవాడు. ముందుగా ముద్రించిన జనన ధృవీకరణ పత్రాల ఫారమ్‌లను ఉపయోగించి నిందితుడు నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించాడు. నకిలీ ఓటర్ ఐడీ కార్డులను ఉపయోగించి ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
- గెజిటెడ్ ఆఫీసర్ నేమ్ స్టాంపుల సాయంతో ఆధార్ కార్డ్‌లో చిరునామా మార్పులు చేశాడు. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి పాస్‌పోర్ట్‌లను పొందాడని పోలీసులు చెప్పారు. ఇతను నకిలీ జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డుల్లో పేరు, పుట్టిన తేదీని మార్చాడని పోలీసులు పేర్కొన్నారు. నకిలీ ఐడీలను సృష్టించడం ద్వారా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేశాడు.

నిందితుడు మహబూబ్ సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్ట్ వర్కర్. ఇతనికి పాఠశాలల్లో మాత్రమే ఆధార్ కార్డ్‌లో సవరణలు చేయడానికి అధికారం ఉంది. ఆర్ఎస్ ఆన్‌లైన్ సేవల కోసం అనధికారికంగా తన సేవలను పొడిగించి సులభంగా డబ్బు సంపాదించాడని పోలీసులు చెప్పారు.నిందితులు రాచమల్ల విజయలక్ష్మి, కూరపాటి పల్లవి ఆర్‌ఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారని,నకిలీ పత్రాలు,నకిలీ సంతకాలు పెట్టి ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు సహకరించారన్నారు.
నిందితుడు బండి శంకర్ పాస్‌పోర్ట్ ఏజెంట్ అని, అతను పాస్‌పోర్ట్‌లు పొందేందుకు నకిలీ సపోర్టింగ్ డాక్యుమెంట్లు కావాల్సిన అవసరం ఉన్న కస్టమర్లను ఆర్‌ఎస్ ఆన్‌లైన్ సర్వీసెస్‌కు తీసుకువస్తాడని పోలీసులు చెప్పారు.నిందితుడు గిరిరాజ్ అనిల్ కుమార్ సికింద్రాబాద్‌ జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని, అతను నకిలీ ఓటర్ ఐడీ కార్డుల జారీలో రాజ్ కుమార్ కు సహకరించాడని పోలీసులు చెప్పారు.ఈ ముఠా వేలాది ఓటరు ఐడీలు, ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు, జనన ధృవీకరణ పత్రాలు, పాన్ కార్డులను సృష్టించారని వెలుగుచూసింది. నిందితులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News