కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్‌లో ఉందా?

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, అందుకు వాళ్ల తప్పులను, వైఫల్యాలను ఎత్తి చూపడమే కారణమని అన్నారు కేటీఆర్.

Update: 2024-10-29 09:44 GMT

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, సీఎం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, అందుకు వాళ్ల తప్పులను, వైఫల్యాలను ఎత్తి చూపడమే కారణమని అన్నారు కేటీఆర్. ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ కేటీఆర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో ప్రభుత్వంపై పలు కీలక విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రేవంత్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ కేటీఆర్ విమర్శించారు.

వారి వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ఎత్తిచూపడం వల్లే బీఆర్ఎస్ నేతలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇవి కేవలం ఆరంభమేనని, రానున్న కాలంలో తమను మరింత తీవ్రంగా వేధించడానికి కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని అన్నారు కేటీఆర్. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. కక్షసాధింపు అనేది కాంగ్రెస్ డిక్షనరీలోనే లేదని, కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తుంది తప్ప రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధించుకోవడానికి కాదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

కేటీఆర్ ట్వీట్‌లో ఏముందంటే..

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ తీరుతో తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురై ఉంది. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కేవలం ప్రారంభమే. రానున్న రోజుల్లో ఈ వేధింపులు మరింత పెరగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులు, కార్యకర్తులు, సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు, ప్రభుత్వం చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, కుతంత్రాలను, అబద్ధపు ప్రచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం.

కాంగ్రెస్ కుట్రపూరితంగానే డీప్ ఫేక్ సాంకేతికత వంటి వాటిని వినియోగించుకుంటూ, పెయిడ్ ఆర్టిస్టులతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి ఉంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయనున్నాయి. ఇటువంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలపైనే పోరాడదాం. వాటిపైనే మన పోరాటం కూడా.

మనమంతా కలిసి తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న పోరాటంపైనే దృష్టి పెడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని, అసమర్దతను, కపటత్వాన్ని ఎత్తి చూపుదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం వారిపై ఒత్తిడి తీసుకొద్దాం’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News