Uttam Kumar Reddy | ‘ప్రతిపక్షాల ప్రచారాలు నమ్మొద్దు’

తెలంగాణ ప్రభుత్వం అందించనున్న కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి.;

Update: 2025-01-23 12:24 GMT

తెలంగాణ ప్రభుత్వం అందించనున్న కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామ సభల్లో ఉంచిన లిస్ట్ తుది జాబితానా? అందులో పేరు లేకుంటే రేషన్ కార్డు రానట్టేనా? అన్న అనుమానాలు ప్రజల్లో తీవ్రంగా ఉన్నాయి. ఇదే అంశంపై ప్రతిపక్షాలు కూడా భారీగా ప్రచారం చేస్తోంది. రేషన్ కార్డులు అందిస్తామని చెప్పి ఇప్పుడు వాటిల్లో కూడా కోతలు పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి పథకంలో కోతలు పెడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు రేషన్ కార్డుల్లో కూడా ఆ సంప్రదాయాన్ని తీసుకొస్తోందంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. కాగా ఈ అనుమానాలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాటుగా స్పందించారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్పప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందిస్తామని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి కడుపుమంటతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేళ్లలో 40వేల రేషన్ కార్డులే..

దాదాపు పది సంవత్సరాల పాటు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపించిన బీఆర్ఎస్ తమ పాలన సమయంలో కేవలం 40వేల రేషన్ కార్డులు మాత్రమే జారీ చేశారని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతోన్న కార్డుల సంఖ్య లక్షల్లో ఉండనుందని, ఇప్పటికే ప్రతి జిల్లా వారీగా అర్హమైన కుటుంబాల జాబితాను కూడా సిద్ధం చేశామని తెలిపారు. అయితే ప్రస్తుతం గ్రామ సభలో ఉంచిన జాబితా తుది జాబితా కాదని ఆయన స్పష్టం చేశారు. అది కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమేనని, అందులో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవడం ద్వారా కొత్త రేషన్ కార్డులు పొందొచ్చని వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ అనేది ఒకసారి చేసి ఆపే ప్రక్రియ కాదని, అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయాని వెల్లడించారు.

Tags:    

Similar News