‘విజయ’దే విజయం.. టెండర్లకు స్వస్తి పలికిన ప్రభుత్వం..

తెలంగాణలో దేవాలయాలకు నెయ్యి సరఫరా చేసే అంశంలో విజయ డైరీనే విజయం సాధించింది. అన్ని దేవాలయాల్లో విజయ డైరీ నెయ్యినే వాడాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడమే ఇందుకు కారణం.

Update: 2024-09-26 08:43 GMT

తెలంగాణలో దేవాలయాలకు నెయ్యి సరఫరా చేసే అంశంలో విజయ డైరీనే విజయం సాధించింది. అన్ని దేవాలయాల్లో విజయ డైరీ నెయ్యినే వాడాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడమే ఇందుకు కారణం. ఇంత కాలం చాలా ఆలయాలు సొసైటీలకు కూడా నెయ్యి కాంట్రాక్ట్‌లను అందించాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో అటువంటి సొసైటీలు చిక్కుల్లో పడనున్నాయి. దీంతో నెయ్యి సరఫరాలో ‘విజయ’దే విజయంలా కనిపిస్తోంది. దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి అంశం కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యిని కోనుగోలు చేయడం వల్లనే కల్తీ అన్న అనుమానాలు వస్తున్నాయని గ్రహించి దానికి పరిష్కారం ఆలోచించింది. ఇకపై రాష్ట్రంలోని ప్రతి దేవాలయం కూడా విజయ డైయిరీ నెయ్యినే వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఎటువంటి కల్తీ జరిగినా.. విజయ డైరీ ప్రభుత్వ సంస్థ కావడంతో సదరు ప్రభుత్వ శాఖ జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందని ప్రభుత్వం వివరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లూ ప్రభుత్వ సంస్థను కాదని టెండర్ల పేరుతో ప్రైవేటు సంస్థల నెయ్యికే దేవాలయాలు ప్రాధాన్యత ఇవ్వడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ దేవాలయాలకు నెయ్యి సరఫరా చేయడానికి వేసే టెండర్ల సంప్రదాయానికి స్వస్థి పలుకుతూ జీవోను విడుదల చేసింది. టెండర్లతో సంబంధం లేకుండా ఇకపై అన్ని దేవాలయాలు విజయ డైరీ నెయ్యినే వినియోగించాలని ఉత్తర్వలు స్పష్టం చేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధఇ కూడా జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

కమీషన్ల కక్కుర్తే కారణం..

కమీషన్ల రుచి మరిగే ఆలయాల ప్రతినిధులు.. ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజయ డైరీ తయారు చేస్తున్న నెయ్యిని పట్టించుకోవడం లేదని, అధికంగా కమీషన్లు వచ్చే ప్రైవేటు సంస్థల నెయ్యిని కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నారంటూ ప్రభుత్వం మండిపడింది. ఈ కమీషన్ల కక్కుర్తికి చెక్ పెట్టడానికి, భక్తుల మనోభావాలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నిశ్చింతగా భక్తులు ప్రసాదాలు సేవించొచ్చని, కల్తీ అన్న మాటకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వమే జవాబుదారీగా ఉంటుందని వివరించింది.

అన్ని ఆలయాల్లో ఇదే పరిస్థితి..

తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న ఆలయాలు 12, రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం ఉన్న ఆలయాలు 24, రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు 325 ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని ఆలయాలు కూడా తమ లడ్డూ, ప్రసాదం, నైవేద్యం తయారీకి ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసిన నెయ్యినే వినియోగిస్తున్నాయి. పెద్దపెద్ద దేవాలయాల్లో నెయ్యి సరఫరా చేసే సంస్థలను టెండర్ల రూపంలో ఎన్నుకుంటుండగా.. చిన్నిచిన్న ఆలయాల్లో అధికారులే నేరుగా సంస్థల నుంచి కొనుగోలు చేసేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ నాణ్యతకు అధికా ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. దేవాలయాలు మాత్రం ప్రైవేటు మార్గానే వెళ్తున్నాయి.

మందగించిన విజయ డైరీ కొనుగోళ్లు..

ఇంత కాలం విజయ డైరీ నుంచి అధిక మొత్తంలో నెయ్యిని ముంబైలోని కొన్ని సంస్థలు కొనుగోలు చేసేవి. అవి కూడా ఈ ఏడాది ఆరంభం నుంచి మానేయడంతో విజయ డైరీ కొనుగోళ్లు మందగించాయి. దాదాపు 50 టన్నులకు పైగా నెయ్యి డైరీలోనే ఉండిపోయింది. ఈ నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దాని నాణ్యత లోపిస్తుందని అధికారులు గుర్తించారు. దీంతో ఈ నెయ్యి సేల్ చేయడంపై డైరీ ఎంపీ లక్ష్మీ దృష్టిసారించి.. మార్చి 15న దేవాదాయ శాఖకు లేఖ రాశారు. తమ సంస్థ వద్ద నెయ్యి కొనుగోలు చేయాలని ఆమె తన లేఖలో కోరారు. తమ నెయ్యిని కొనడానికి దేవాదాయ శాఖ, దేవాలయాలు ముందుకు రావాలని కోరారు. అయితే ఎటువంటి స్పందన రాలేదు.

తిరుపతి వివాదంతో వచ్చిన మార్పు..

ఇప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో తీవ్రమైన కల్తీ జరిగిందంటూ వివాదం చెలరేగడం విజయడైరీకి కలిసొచ్చినట్లయింది. ఈ వివాదం చెలరేగిన క్రమంలో విజయ డైరీ ఉన్నతాధికారులు.. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. నాణ్యమైన విజయ డైరీ నెయ్యిని దేవాలయాలు వినియోగించుకోకపోవడాన్ని ఆయన వివరించారు. ఈ విషయంపై దృష్టి సారించిన ఘోష్.. దేవాదాయశాఖ వద్దకు వెళ్లి ఆరా తీశారు. దీంతో దేవాలయాలన్నీ కూడా ప్రైవేటు సంస్థ నుంచే నెయ్యి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. దేవాలయాల్లో విజయ డైరీ నెయ్యి వినియోగించేలా చర్యలు చేపట్టారు.

నెయ్యి కొనుగోలులో అవినీతి..

దేవాదాయశాఖ దగ్గర ఆరా తీసిన క్రమంలో అనేక విషయాలు వెళ్లడైనట్లు ఘోష్ చెప్పారు. దేవాలయాల కోసం నెయ్యి కొనుగోలు చేసే క్రమంలో కొన్ని ఆలయాల్లో అవినీతి జరిగినట్లు తాము గుర్తించామని అన్నారు. మరికొన్ని దేవాలయాల్లో జిల్లా డైరీల పేరుతో కొన్ని సంస్థల నుంచి నెయ్యి తీసుకొచ్చి వినియోగించినట్లు తేలిందన్నారు. గతంలో బాసర దేవాలయానికి సంబంధించి ఒక అధికారి దాదాపు రూ.5 కోట్ల అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కినట్లు వెల్లడైంది. దేవాలయాల నెయ్యి విషయంలో జరుగుతున్న అవినీతి తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం విజయ డైరీ నెయ్యినే వినియోగించాలంటూ దేవాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాదు కూడదు అని ఎవరైనా ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

విజయ డైరీ నెయ్యిపై ఐదు ఆలయాల ఆసక్తి..

ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిన క్రమంలో విజయ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి ఐదు దేవాలయాలు ముందుకొచ్చాయి. వేములవాడ దేవస్థానం 10వేల కిలోలు, బాసర ఆలయం 1500 కిలోలు, వరంగల్ భద్రకాళి ఆలయం 1,050 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం 980 కిలోలు, మంచిర్యాల వేంకటేశ్వరస్వామి దేవాలయం 105 కిలోల నెయ్యి కొనుగోలు ఆర్డర్లు ఇచ్చాయి. ఈ ఆర్డర్లు అందడంతో వాటిని సరఫరా చేయడానికి విజయ డైరీ సన్నద్ధమవుతోంది. త్వరలోనే మిగిలి ఆలయాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఘోష్ తెలిపారు.

Tags:    

Similar News