Mahesh Kumar Goud | ‘ప్రతిఒక్కరూ పార్టీ నియమాలు పాటించాల్సిందే’

కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.;

Update: 2025-02-05 11:08 GMT

కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండే ప్రతి నాయకుడు కూడా వాటిని తూచా తప్పకుండా పాటించాలని, నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఇటీవల కొందరు పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ పద్దతిని పార్టీ ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదని తెలిపారు. పీసీసీ కమిటీలో 50-60శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారని వివరించారు. మెజార్టీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా న్యాయం జరగడం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే తమ పార్టీ ప్రభుత్వం రాష్ట్రం కుల గణన జరిపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలను అందించడం శులభతరం అవుతుందని, అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వ పథకాలను రూపొందించడం వీలవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

‘‘కులగణన సర్వే కోసం బీసీ సంఘాలు చాలా ఏళ్లు ఎదురుచూశాయి. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలి. భవిష్యత్‌లో జరిగే జనాభా గణనలోనూ కులగణన అంశాన్ని చేర్చాలి. కేంద్రం చేసే జనగణనలో కులగణన కూడా చేస్తానని బీజేపీ వెల్లడించాలి. రాష్ట్రంలో 3.66 శాతం మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదు. వివరాలు ఇవ్వనివారు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు మరే రాష్ట్రం చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపింది. చేసిన వారిని అభినందించాల్సింది పోయి కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారు. పార్టీలో ఉన్న వారు కూడా కొందరు తమ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీపై తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా.. పార్టీ నియమనిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అటువంటి వారిపై తీవ్ర చర్యలు ఉంటాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే కొందరు పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం చేపట్టిన కులగణనపై తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్నను ఉద్దేశించన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ప్రభుత్వం జరిపిన కులగణనపై తీన్మార్ మల్లన్న అలియాజ్ చింతపండు ప్రవీణ్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రిపోర్ట్ ఒక చెత్త అని.. దానిని చింపి చెత్తబుట్టలో వేయాలంటూ వీడియో చేశారు. ఈ అంశానికి సంబంధించే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News