రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత నెల రోజుల్లోనే 187 ఈవ్ టీజింగ్ కేసులు నమోదయ్యాయి. బాలికలు, మహిళలను వేధిస్తున్న పోకిరీల భరతం పట్టేందుకు రాచకొండ షీ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, కూరగాయల మార్కెట్లు, పార్కులు, కార్యాలయాలు ఇలా ఒకటేమిటి బహిరంగ స్థలాల్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. బాలికలను, మహిళలను వేధిస్తున్నారు. మహిళలను వెంటాడటం, వారిని వేధిస్తున్న పోకిరీల ఆట కట్టించేందుకు మఫ్టీలో షీటీమ్ లు డెకాయ్ ఆపరేషన్ చేపట్టామని రాచకొండ షీ టీమ్స్ విభాగం డీపీపీ టి ఉషా విశ్వనాథ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.మహిళలను వేధిస్తున్న పోకిరీల చేష్టలను వీడియో సాక్ష్యాలతో పట్టుకొని వారిని న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నామని మహిళా భద్రతా విభాగం డీసీపీ వివరించారు.
మైనర్ బాలురు కూడా ఈవ్ టీజర్లే...
మహిళలను వేధిస్తుండగా పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్ వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత నెల రోజుల్లో 187 మంది ఈవ్ టీజర్లపై షీ టీమ్స్ కేసులు నమోదు చేశాయి. ఇందులో 122 మంది మేజర్స్ అని, మరో 65 మంది మైనర్స్ కూడా ఈవ్ టీజింగ్ కేసుల్లో దొరికారని రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు చెప్పారు. పోకిరీలకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి నెలలో 241 కేసుల్లో ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్ చేశారు.
ఎన్నెన్నో ఈవ్ టీజింగ్ కేసులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధించిన కేసులు పెరిగాయి. 28 మంది మహిళలను ఆకతాయిలు ఫోన్ల ద్వారా వేధించారు. సోషల్ మీడియా ద్వారా మరో 85 మంది పోకిరీలు వేధించారు. నేరుగా మహిళలను వేధించిన 128 మందిపై తాము కేసులు పెట్టామని షీ టీమ్ పోలీసు అధికారి చెప్పారు. 14 మంది పోకిరీలపై క్రిమినల్ కేసులు, మరో 71 మంది ఆకతాయిలపై పెట్టీ కేసులు నమోదు చేశామని రాచకొండ షీ టీమ్ ఇన్ స్పెక్టర్ అంజయ్య చెప్పారు.
ప్రేమ, పెళ్లి పేరిట మోసం
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతికి అదే కంపెనీలో పనిచేస్తున్న యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి శారీరకంగా పలుసార్లు కలిశాడు.కొన్నాళ్లు యువతితో కలిసి ఉన్నాక, తన కుటుంబసభ్యులు అంగీకరించడం లేదని పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయిన యువతి షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
సహ ఉద్యోగినిని పెళ్లి చేసుకోమంటూ యువకుడి వేధింపులు సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని అదే కంపెనీలో పనిచేస్తున్న యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వేధింపులకు దిగాడు. తరచూ ఫోన్ చేసి యువతిని వేధిస్తుండగా షీ టీమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
పరిచయం ఉన్న ఓ మహిళకు తరచూ ఫోన్ చేస్తూ వేధిస్తుండటంతో బాధితురాలు షీ టీమ్ ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇబ్రహీం పట్నం బస్గాండులో ఓ యువకుడు బాలికను వేధిస్తుండగా షీ టీమ్ రంగంలోకి దిగి పోకిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మెట్రో రైళ్లలోని మహిళా బోగీల్లో ప్రయాణిస్తున్న 12 మంది యువకులపై షీ టీమ్ పోలీసులు పట్టుకొని మెట్రో రైలు అధికారులతో జరిమానాలు విధించారు. మహిళలపై వేధింపులు పెరిగిన నేపథ్యంలో రాచకొండ షీ టీమ్ పోలీసులు 17970 సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలు, బాలికలకు షీ టీమ్ గురించి అవగాహన కల్పించారు.