హైదరాబాద్‌లో ఇక ఎలివేటెడ్ కారిడార్‌లు

హైదరాబాద్- కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో రెండు ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది.;

Update: 2025-07-09 02:11 GMT
హైదరాబాద్ లో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌ నమూనా

హైదరాబాద్ నగరంలో కీలకమైన రెండు ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి రక్షణశాఖ భూమిని బదిలీ చేయడానికి హెచ్ఎండీఏ, తెలంగాణ డిఫెన్స్ అథారిటీల మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఎస్ హెచ్ -01, డెయిరీ ఫామ్ రోడ్ కారిడార్ ఎన్ హెచ్-44 ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ నగరంలో రెండు ప్రధాన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది.


ఉత్తర్వుల జారీ
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ , తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏల మధ్య అవగాహన ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది.ఈ ఒప్పందంలో రక్షణ, రాష్ట్ర భూముల మార్పిడి, ప్రధాన ట్రాఫిక్ మార్గాల రద్దీని తగ్గించడానికి, నగర కనెక్టివిటీని మెరుగుపర్చడానికి, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సజావుగా సాగడానికి వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాలకు మార్గాలను హెచ్ఎండీఏ నిర్మించనుంది. రక్షణ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (భూములు) విక్రమ్ వర్మ సమాన విలువ గల భూమి బదిలీ,నగదు పరిహారం చెల్లింపుపై రక్షణ భూమిని హెచ్ఎండీఏకు బదిలీ చేయడానికి సంబంధించి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.



 ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక 2050

హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ ముసాయిదా ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక 2050 సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడంలో రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కీలక పాత్ర పోషించనుంది.

రక్షణ శాఖ భూమి బదిలీ
రాష్ట్ర రహదారి-1లోని జింఖానా గ్రౌండ్ నుంచి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (శామీర్‌పేట్ ఓఆర్ఆర్) మధ్య ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించడానికి 4,59,222 చదరపు మీటర్ల రక్షణ భూమిని హెచ్ఎండీఏకు బదిలీ చేయనున్నారు. దీని కోసం ఇదే సమాన విలువ కలిగిన భూమిని రక్షణ శాఖకు హెచ్ఎండీఏ బదలాయించనుంది.



 ప్యారడైజ్ సర్కిల్ టు సుచిత్ర జంక్షన్ కారిడార్

‘స్టాండర్డ్ టేబుల్ ఆఫ్ రెంట్స్’-2023 ప్రకారం తెలంగాణ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ రూ.867.64 కోట్ల మొత్తాన్ని అంచనా వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో రూ. 954.41 కోట్లు రక్షణ భూమి విలువగా, 10శాతం వార్షిక పెరుగుదలతో పాటు అంచనా వేశారు.జాతీయ రహదారి - 44 లోని ప్యారడైజ్ సర్కిల్, సుచిత్ర జంక్షన్ (డైరీ ఫామ్) మధ్య ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ కోసం మొత్తం 2,26,039.91 చదరపు మీటర్ల రక్షణ భూమిని హెచ్ ఎండీఏకు బదిలీ చేయనున్నారు. దీనికోసం నగదు పరిహారం కింద రూ.748.58 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించనుంది.


Tags:    

Similar News