ఏళ్ళ చరిత్ర ఉన్న 8 టవర్ల ప్రస్థానం ముగిసింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లోని ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేశారు.

By :  Vanaja
Update: 2024-08-05 14:58 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లోని ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేశారు. దీంతో ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన వీటి ప్రస్థానం నేటితో ముగిసింది. 130 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ టవర్లు కేటీపీఎస్ ఓ అండ్ ఎమ్ కాంప్లెక్స్‌లోని పాత యూనిట్లలో భాగంగా ఉన్నాయి. కాలం చెల్లడంతో ఈ ఫ్యాక్టరీ 2020 నుంచి మూతపడి ఉంది. అయితే కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్ నిర్ణయం తీసుకుంది.

రాజస్థాన్‌కు చెందిన ఒక కంపెనీకి చెందిన నిపుణుల పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగాయి. ఖచ్చితమైన భద్రతా నియమాలకు కట్టుబడి ఈ కూల్చివేతలు జరిపినట్టు తెలుస్తోంది. కూల్చివేసిన టవర్లలో నాలుగు 1966 నుంచి 1967 మధ్య నిర్మించబడ్డాయి. మిగిలిన నాలుగు 1974 నుంచి 1978 మధ్య నిర్మించబడ్డాయి. విద్యుదుత్పత్తికి తోడ్పడటానికి జపాన్ సాంకేతికతతో దశలవారీగా ఈ యూనిట్లు అభివృద్ధి చేయబడ్డాయి.

2023 జనవరి 18 నుంచి పాత ఫ్యాక్టరీకి సంబంధించిన టవర్ల కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO) కూల్చివేత కోసం టెండర్లను ఆహ్వానించింది. రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. 30 మంది సిబ్బంది సుమారు నెల రోజుల పాటు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం మూడు దశల్లో కూల్చివేత కొనసాగింది. మొదట 'ఏ' స్టేషన్లోని 102 మీటర్ల ఎత్తు కలిగిన నాలుగు కూలింగ్ టవర్లు కూల్చివేశారు. ఆ తర్వాత 115 మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను రెండు దశల్లో నేలమట్టం చేశారు. ఇంప్లోషిన్ అనే పేలుడు పదార్థాన్ని దీనికోసం వాడారు. కూల్చిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు.

Tags:    

Similar News