Eco Tourism |న్యూఈయర్ వేళ కళకళలాడుతున్న పర్యావరణ పర్యాటక కేంద్రాలు

హైదరాబాద్ తోపాటు శివార్లలో వెలసిన పర్యావరణ పర్యాటక కేంద్రాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.కొత్త సంవత్సరంవేళ ఎకో టూరిజం కేంద్రాల్లో పర్యాటకుల రద్దీ పెరిగింది.;

Update: 2024-12-31 12:30 GMT

పచ్చని ఎతైన చెట్లు...చెంగు చెంగున పరుగులీడుతున్న జింకలు...వివిధ రకాల వన్యప్రాణులతో ఉన్న తెలంగాణలోని అడవుల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పర్యావరణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

- అడవుల్లో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అటవీ గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల్లో పర్యావరణ కుటీరాలు నిర్మించి, సరస్సుల్లో బోటింగ్, సఫారీ మార్గాల్లో సందర్శకులకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.
- తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.త్వరలోనే ఎకో టూరిజం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు అటవీశాఖ ప్రాజెక్టు మేనేజరు సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పాలసీ ద్వారా 12 ప్రాంతాలను ప్రకృతి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సుమన్ వివరించారు.



పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఎకో టూరిజం కేంద్రాలు

కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో బొటానికల్ గార్డెన్, పాలపిట్ట సైక్లింగ్ పార్క్, ఫారెస్ట్ ట్రెక్ పార్కు, ఏఆర్ టెక్నాలజీతో వర్చువల్ సఫారీ, ఎకో థీమ్ పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ నగరంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఆహ్లాదం కోసం పర్యావరణ పర్యాటక కేంద్రాలను సందర్శిస్తున్నారు. టెక్కింగ్ చేయడంతోపాటు అడ్వెంచర్ స్పోర్టుతో పాటు అడవిలో టెంట్లలో రాత్రి బస చేసేందుకు ముందుకు వస్తున్నారు. పర్యావరణంపై నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము పలు కార్యక్రమాలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారి సుమన్ వివరించారు. కొత్తగూడలో 7.50 ఎకరాల్లో రూ.4కోట్లతో వర్చువల్ సఫారీని ఏర్పాటు చేశారు.9 డి సినిమా టెక్నాలజీ సాయతో జలపాతం, వర్చువల్ సఫారీని ఏర్పాటు చేశారు. అక్వేరియం, కాయకింగ్, నేచర్ వాక్ అనుభవాలు మిగిల్చేలా దీన్ని రూపొందించారు.



 75 రకాల థీమ్ మొక్కలతో వృక్షపరిచయ క్షేత్రం

కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో 75 రకాల థీమ్ మొక్కలతో వృక్షపరిచయ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. దేశ, విదేశాల్లో లభించే వివిధ రకాల వృక్షాలతో 94.88 ఎకరాల్లో వివిధ రకాల మొక్కలు పెంచారు. పెన్సిల్, రబ్బర్ గార్డెన్, స్పోర్ట్సు గార్డెన్, ఫారెస్ట్ థీమ్ పార్కు పెంచారు.



 చిలుకూర్ ఫారెస్ట్ ట్రెక్ పార్క్

అప్ప జంక్షన్ వద్ద చిల్కూర్ ఫారెస్ట్ ట్రెక్ పార్కు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 100 హెక్టార్లలో రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో సైకిల్ ట్రాక్ నిర్మించారు. సరస్సు, చెక్ డ్యామ్ నిర్మించారు. 30వేల రకాల మొక్కలు నాటారు. ట్రెక్కర్స్, ప్రకృతి ప్రేమికులకు చిల్కూర్ ఫారెస్ట్ ట్రెక్ పార్కు విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్క్ వన దృశ్యం, చందన వనం, వెదురు వనాలను అభివృద్ధి చేశారు.

కొత్తగా 15 ఎకో టూరిజం ప్రాజెక్టులు
తెలంగాణ రాష్ట్రంలో 2025వ సంవత్సరంలో 15 పర్యావరణ పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నందిపేట, కనకకార్గిరి హిల్స్, అనంతగిరి హిల్స్ ప్రాంతాల్లో దక్కన్ ఉడ్స్ అండ్ ట్రైల్స్ పేరిట ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

ముచ్చర్ల జూ ప్రాజెక్టు
వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముచ్చర్లలో జూ ప్రాజెక్టును కొత్త సంవత్సరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అటవీఅభివృద్ధి సంస్థ ఎండీ జి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వన్యప్రాణుల సందర్శన కోసం కొత్త జూపార్కు నిర్మాణంతోపాటు సందర్శకులకు ప్రకృతి పర్యావరణ అనుభూతిని అందించేందుకు వీలుగా ముచ్చర్ల అటవీ ప్రాంతంలోని 15వేల ఎకరాల్లో ఎకో విలేజ్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.



Tags:    

Similar News