ఇద్దరూ ఇద్దరే...గట్టి నేతలను కోల్పోయిన తెలంగాణా

డీఎస్ అయినా రమేష్ అయినా తామున్న పార్టీల్లో కమిటెడ్ గానే పనిచేశారు.

Update: 2024-06-29 10:48 GMT

తెలంగాణాలోని రెండు పార్టీల్లో ఒకేరోజు విషాధం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మరణించగా, ఉదయం బీజేపీ సీనియర్ నేత రమోష్ రాథోడ్ మరణించారు. డీఎస్ గా పాపులరైన ధర్మపురి శ్రీనివాస్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక రమేష్ విషయం చూస్తే ఈయనకు పెద్దగా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు లేదు. కాకపోతే శక్రవారం అర్ధరాత్రి అనారోగ్యం పాలయ్యారు. దాంతో ముందు లోకల్ ఆసుపత్రిలో చేర్పించి తర్వాత హైదరాబాద్ తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారు.

బీఆర్ఎస్ కు దూరమైన డీఎస్ ఈమధ్యనే కాంగ్రెస్ లో చేరారు. గాంధీభవన్ కు చక్రాల కుర్చీలోనే కొడుకు ధర్మపురి సంజయ్ తో కలిసొచ్చారు. ప్రజాప్రతినిధిగా చాలా సంవత్సరాలున్నారు. ఎంఎల్ఏగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ఎంఎల్సీ, ఎంపీగా తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో కలిసి 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో విన్నింగ్ జంటగా బాగా పాపులరయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ 1989,99, 2004 మూడుసార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. ఉన్నతవిద్యాశాఖతో పాటు చాలా శాఖలకు మంత్రిగా పనిచేశారు. తెలంగాణా ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. కొంతకాలం ప్రభుత్వ సలహాదారుగా పనిచేసి రాజీనామా చేశారు. తర్వాత రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత కేసీయార్ తో విభేదాల కారణంగా రాజీనామా చేసి చివరకు కాంగ్రెస్ లోనే చేరారు.

ఇక రమేష్ రాథోడ్ విషయం చూస్తే ఆదిలాబాద్ జిల్లలోని ఖానాపూర్ నియోజకవర్గంలో 1999లో టీడీపీ తరపున ఎంఎల్ఏగా పనిచేశారు. ఆ తర్వాత నార్నూర్ జడ్పీటీసీగా గెలిచి 2006-09 మధ్య జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఆదిలాబాద్(ఎస్టీ) ఎంపీగా టీడీపీ తరపున గెలిచారు. చాలా కాలం టీడీపీలోనే ఉన్న రమేష్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో భాగంగా పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కు రాజీనామాచేసి బీజేపీ, కాంగ్రెస్ లో కూడా చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత క్రమశిక్షణా చర్యల కింద రమేష్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దాంతో మళ్ళీ బీజేపీలో చేరారు. చివరి వరకు రమేష్ బీజేపీ నేతగానే ఉన్నారు.

డీఎస్ అయినా రమేష్ అయినా తామున్న పార్టీల్లో కమిటెడ్ గానే పనిచేశారు. గిరిజనుల్లో రమేష్ కు మంచి నేతగా పేరుంది. రమేష్ భార్య సుమన్ రాథోడ్ కూడా ఖానాపూర్ నుండి రెండుసార్లు టీడీపీ ఎంఎల్ఏగా పనిచేశారు. బీసీల్లో డీఎస్ కు పట్టుందనే చెప్పాలి. ఇద్దరు కొడుకుల్లో ఒకళ్ళు సంజయ్ నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ గా పనిచేస్తే మరో కొడుకు ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున రెండోసారి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. మొత్తంమీద ఇద్దరు నేతలు ఒకేరోజు మరణించటం రెండుపార్టీలకు తీరని లోటనే చెప్పాలి.

Tags:    

Similar News