నిరుద్యోగులు అపోహలు నమ్మొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గ్రూప్-1 విషయంలో అపోహలు నమ్మవద్దని సీఎం ఎ రేవంత్ రెడ్డి కోరారు.పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.

Update: 2024-10-19 14:42 GMT

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గ్రూప్-1 విషయంలో అపోహలు నమ్మవద్దని సీఎం ఎ రేవంత్ రెడ్డి కోరారు.జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్స్ కు సెలెక్ట్ చేశామని ఆయన వివరించారు.పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.


నిరుద్యోగులకు నా సూచన
‘‘తెలంగాణ నిరుద్యోగులకు మీ సోదరుడిగా నా సూచన ఒక్కటే...పదేళ్లుగా వాయిదా పడుతున్న అన్ని ఉద్యోగాలను మన ప్రభుత్వంలో భర్తీ చేసుకుంటున్నాం.గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది తప్ప నియామకాలు చేపట్టలేదు.కొందరు స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం నియామకాల భర్తీ జరగకుండా ప్రయత్నించారు.అయినా అన్నింటినీ ఎదుర్కొని మేం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

అందరికీ న్యాయం చేసేందుకే జీఓ 29
గ్రూప్-1 విషయంలో కొన్ని రాజకీయపార్టీలు వితండవాదం చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు.మధ్యలో నిబంధనలు మారిస్తే కోర్టులు పరీక్షల్ని రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు.జీవో 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారని, అందుకే అందరికీ న్యాయం జరగాలనే జీవో 29 ను ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం చెప్పారు.‘‘పదేళ్లు అధికారంలో ఉన్నపుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని వారు ఇవాళ మిమ్మల్ని దగ్గరికి పిలుస్తున్నారు..ఇది కొంగ జపం కాదా.. ఒక్కసారి ఆలోచించండి..గ్రూప్-1 అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరవండి.. లేకపోతే ఒక బంగారు అవకాశం కోల్పోతారు.న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్ధించాయి.ఆ నాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి.. వారి ప్రాణాలు బలిగొని రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించారు’’అని సీఎం ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు స్ఫూర్తిని ఇచ్చేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సీఎం చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోలీసు సోదరులది కీలకపాత్ర అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీస్ కిష్టయ్య త్యాగం ఎప్పటికీ మరిచిపోలేమని సీఎం గుర్తు చేసుకున్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ విషయంలో దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని సీఎం కోరారు.


Tags:    

Similar News