బంగారం కోసం ‘గాలి’ ఆరాటం..!
బంగారం తుప్పు పడుతుందా? చెడిపోతుందా?;
గాలి జనార్ధన్ రెడ్డి.. ఓబులాపురం మైనింగ్ కేసులో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. గనుల అక్రమ తవ్వకాల ద్వారా రూ.కోట్లు గడించారు. ఆయన అక్రమంగా సంపాదించారనే ఆరోపణలతో 2009లో ఆయనపై కేసు నమోదు చేసింది సీబీఐ. ఆయన దగ్గర నుంచి 2009-2011 మధ్యలో సుమారు 54 కిలోల బరువుండే 105 బంగారు ఆభరణాలతో పాటు రూ.3కోట్ల నగదు, రూ.కోట్ల విలువైన బాండ్లను స్వాధీనం చేసుకుంది. ఇదంతా చరిత్ర. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తావనలోకి వచ్చారు? ఎందుకంటే అప్పట్లో తన దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం కోసం జనార్దన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ కేసును తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టేసింది. సీబీఐ కస్టడీ నుంచి తన బంగారాన్ని.. ఎలాగైనా విడిపించుకోవాలన్న ‘గాలి’ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ బంగారం కోసం జనార్దన్ రెడ్డితో పాటు ఆయన కొడుకు కిరీట్ రెడ్డి, కూతురు బ్రాహ్మణి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. బంగారాన్ని తమకు అప్పగించాలని వాళ్లు చేసిన వాదనలో పస లేకపోవడంతో కోర్టుల మూడు పిటిషన్లను కొట్టివేసింది.
ఇంతకీ వాళ్ల వాదన ఏమిటంటే.. బంగారు ఆభరణాలను అలా పక్కన పెట్టేస్తే అవి తుప్పు పడతాయని, విలువ తగ్గిపోతుందని వారు తమ పిటిషన్‌లో కోర్టు అభ్యర్థించినట్లు ప్రచారంలో ఉంది. వాళ్ల పిటిషనే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. బంగారానికి తుప్పు పట్టడమేంటి? విలువ తగ్గడమేంటి? అన్న వాదనను జనాలు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన పిల్లలు వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వారు చేస్తున్న వాదనల్లో బలం లేదని పేర్కొంది. వారి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జే లక్ష్మణ్.. ఈ వియంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మధ్యంతర కస్టడీని ఇవ్వడానికి పిటిషనర్ వినిపించిన వాదనల్లో సరిపడా బలం లేదని అన్నారు. అందుకే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న వస్తువుల హక్కులను తేల్చుకోవాలని స్పష్టం చేశారు. నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతుందని, ఈ దశలో స్వాధీనం చేసుకున్న వస్తువలను తిరిగి అప్పగించలేమని వివరించారు. విచారణ తర్వాత నగలను తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బంగారం చెడిపోతుందా..?
అయితే ఇక్కడ అసలు ప్రశ్న బంగారం చెడిపోతుందా? అనేది. నిజానికి బంగారు ఆభరణాలను ధరించి ఉంటే.. కొన్నాళ్లకు అవి రాపిడి కారణంగా అత్యల్ప మోతాదులో అరుగుతాయి. దానిని బంగారు దుకాణదారులు అరుగు లేదా తరుగు అంటారు. కానీ బంగారాన్ని కొన్నేళ్ళ పాటు లాకర్లు, బీరువాలు వంటి వాటిల్లో పెట్టేస్తే అవి అరగవు. కాకపోతే వాటి మెరుపు తగ్గి కాస్తంత నల్లబడతాయి. కానీ దాని వల్ల వాటి విలువ ఏమీ తగ్గదని, మెరుగు పెట్టిస్తే అవి మళ్ళీ యథాతథంగా మెరుస్తూ కనిపించడమే కాకుండా మార్కెట్‌లో ఉన్న విలువే పలుకుతాయని చెప్తున్నారు.
దీంతో బంగారం ఖరీదు తగ్గని క్రమంలో బంగారాన్ని తిరిగి పొందడం కోసం జనార్ధన్ రెడ్డి ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు 2016 అక్టోబర్ 25న కొట్టివేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అంశంపై ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీంతో బంగారాన్ని బయటకు తెచ్చుకోవడానికి ఆయన ఎందుకు అంత తాపత్రయం పడుతున్నారు అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.
ఇందుకు కొందరు మార్కెట్ విలువే ఇందుకు కారణం అంటున్నారు. 2011 లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ సమయంలో 10 గ్రాముల 24క్యారెట్ బంగారం రూ.26,400 ఉంది. గాలి జనార్ధర్ రెడ్డి ఈ ధరకే మొత్తం బంగారం కొన్నారని అనుకున్నా.. అప్పుడు సీబీఐ స్వాధీనం చేసుకున్న 54కిలో బంగారం ధర.. అప్పుడే మొత్తం బంగారం కొన్నారని అనుకున్నా దాని మొత్తం ధర రూ.14,25,60,000. అదే ఇప్పుడు బంగారం ధర చూసుకుంటే బంగారం ధర రూ.88,580 ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఆ బంగారం ధర రూ.47,83,32,000గా ఉంది. దీని ప్రకారం చూసుకుంటే గాలి జనార్ధన్ రెడ్డి బంగారం ధర.. అప్పుడు కొన్న దాని కన్నా ఇప్పుడు రూ.33,57,72,000 అధిక ధర పలుకుతుంది. ఈ లెక్కన ఆయన బంగారం ధర ఎలా తగ్గుతుందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా బంగారం ధర బాగా పెరగడంతోనే ఆయన దానిని తిరిగి పొందాలనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది.