Harish Rao | ‘అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు డాక్టరేట్ ఇవ్వాలి’
మహారాష్ట్ర ప్రజలు నేర్పిన గుణపాఠం తర్వాతైనా రేవంత్ తన తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు.
మహారాష్ట్ర ప్రజలు నేర్పిన గుణపాఠం తర్వాతైనా రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) సూచించారు. పిల్ల చేష్టలు, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, ప్రజలను మోసం చేయడం ఆపాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ రోజు హుజూరాబాద్‌లో పర్యటించిన హరీష్‌రావు.. రేవంత్‌పై మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి డబుల్ పీహెచ్‌డీ చేసినట్లున్నారని, ఆయనకు ఈ విషయంలో డాక్టరేట్ ఇవ్వొచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పట్టపగలే గోబెల్స్ స్థాయిలో ప్రచారం చేస్తున్నారని, అందుకే ఇక్కడ చేసిన ఆరు గ్యారెంటీల మోసాలను మరాఠా ప్రజలు పసిగట్టు వాత పెట్టారంటూ చురకలంటించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణలో ప్రజాస్వామ్యం వస్తుందని కబుర్లు చెప్పారని, కానీ ఇప్పుడు ఆ ఏడో హామీ కూడా తుస్సే అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది ఖూనీ అయిందని విమర్శలు గుప్పించారు.
‘‘కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో మోసం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Elections) కూడా గ్యారెంటీ పేరుతో మోసం చేయబోయారు. అక్కడకు వెళ్లి మహిళలకు మూడు వేలు, రైతులకు రుణమాఫీ చేస్తాం అన్నారు. సీఎం, మంత్రులు వెళ్లి ప్రచారం చేశారు. వీరిని చూసే తెలంగాణలో చేసిన మోసం గుర్తించారు.. గ్రహించారు మహారాష్ట్ర ప్రజలు.. సరైన బుద్ధి చెప్పారు. నూటొక్క దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మోసం చేశారు. మహిళలకు రూ.2500, ఫించన్, భరోసా బోనస్, తులం బంగారం ఇవ్వలేదు. ఇక్కడ చేసిన తప్పులకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా రేవంత్, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి’’ అని సూచించారు.
హామీలపై ఫోకస్ పెట్టండి..
‘‘ఓటమి తర్వాత అయినా బుద్ధి తెచ్చుకొని వంద రోజుల్లో చేస్తామన్న హామీలను ఇప్పటి నుంచైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. 18,500 కుటుంబాలకు కేసీఆర్ దళిత బంధు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత దళితబంధు రెండో విడత డబ్బులు ఇవ్వడం లేదని అడిగితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద అరాచకానికి పాల్పడ్డారు. కొత్త పథకాలు దేవుడెరుగు.. మేము ఇచ్చినవి కూడా సరిగా ఇవ్వడం లేదు. ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క.. దళితులకు మీరు చేసే మేలు ఇదేనా?’’ అని ప్రశ్నించారు.
అబద్ధమాడటానికి సిగ్గుండాలి..
‘‘ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకం డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అబద్ధం చెప్పాడానికి సిగ్గు ఉండాలి. జులై 19 నాడు ఫార్మా సిటీ అని గజిట్ ఇచ్చినవు. కానీ మాట మార్చి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటున్నావ్. ముందు నువ్వు ఇచ్చిన గెజిట్ వాపస్ చేసుకో. ఆ ప్రజల దగ్గరికి వెళ్లి మాట్లాడు. సమస్య పరిష్కరించు. పచ్చటి పొలాలను తొండలు కూడా గుడ్లు పెట్టేని జాగ అంటున్నావ్. అబద్ధాలు మాట్లాడటంలో యూనివర్సిటీ ఉంటే మొదటి డాక్టరేట్ నీకే ఇవ్వాలి’’అని చురకలంటించారు.
అలా ఎలా అంటావ్..
‘‘ కాళేశ్వరం కూలీ పోతే 20 TMC ఎట్లా తీసుకు పోతా అంటున్నావ్. మరి, ఇప్పుడేమో అదే కాళేశ్వరం భాగమైన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ల నుండి హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల తాగునీటిని మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇవ్వాలని ఎలా ప్రణాళిక చేస్తున్నారు? దీనిని బట్టి చూస్తే ఇన్నాళ్లూ ప్రాజెక్టులు విఫలమయ్యాయన్న కాంగ్రెస్ మాటలు అబద్ధమని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు మేలు చేశాయని స్పష్టం అయింది. అసలు, కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, అది కుప్పకూలిందని, రూ.లక్ష కోట్ల అవినీతి అని అబద్ధపు ప్రచారం చేసి మీరు సాధించింది ఏంటంటే… కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను మీ మంత్రి.. మల్లన్న సాగర్ నుండి, రంగనాయక సాగర్ నుండి పంట పొలాలకు విడుదల చేశారు’’ అని ఎద్దేవా చేశారు.
మీరు చెప్పేది ఏది నిజం..?
‘‘మరో మంత్రి గారు దేశ రాజధాని ఢిల్లీలో వ్యవసాయ సదస్సులో తెలంగాణ గత పది సంవత్సరాల్లో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని చెబుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం నీళ్లతో మూసీ పునరుజ్జీవం చేస్తామని చెబుతున్నారు. మళ్లీ ఇవే నీళ్లను హైదరాబాద్ తాగునీటి వసతి కోసం ఉపయోగిస్తామని ప్రకటిస్తున్నారు. ఇందులో ఏది నిజం? మీరు చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడం నిజమా? దాని ద్వారా అందిన ప్రతిఫలం నిజమా? గత ప్రభుత్వాల ఘనతను మెచ్చుకొని మెడలో వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అసలు ఏ ఘనత లేదని చెప్పుకోవడమే దుర్మార్గం’’ అని అన్నారు.
ప్రజలు ఇక నమ్మరు
‘‘సగం తెలంగాణకు మంచి నీరులో ఇచ్చేది కాళేశ్వరం. నీ అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాళేశ్వరం కూలీ పోతే మూసీకి 20 tmc ల నీళ్ళు ఎలా చేరవేస్తావు. మిషన్ భగీరథ ఫెయిల్ అన్నడు. ఇప్పుడు హైద్రాబాద్ కు నీళ్ళు అందించే విషయంలో మిషన్ భాగీరథను భాగస్వామ్యం చేయాలి అన్నడు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. కోటి 61 లక్షల మెట్రిక్ టన్నుల పంట మా గొప్పతనం అంటున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, మేము 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం. ధాన్యాగారం చేశాం. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, పదహారేళ్లు తెలుగుదేశం పార్టీ పాలనలో ఎందుకని కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే తెలంగాణలో పండింది. ఏ కష్టం చేయకుండా విత్తనం వేయకుండానే అది వృక్షమై ఫలాలను అందించిందా?’’ అని నిలదీశారు.
అది కాళేశ్వరం గొప్పతనం
‘‘తెలంగాణ రికార్డు స్థాయిలో కోటి 60 లక్షల ధాన్యం పండిందని, ఇది కాళేశ్వరం గొప్పతనం కాదని, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ గొప్పతనం. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు: రైతుబంధు, రైతు రుణమాఫీ, వ్యవసాయ పనిముట్లు అందించడం, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం, చెరువులను రిజర్వాయర్లతో అనుసంధానం చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయడం. ఇలా అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. అందుకనే ఈరోజు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, దేశం గుర్తించిన నిజం’’ అని స్పష్టం చేశారు.
ప్రతి గింజను కొన్నాం
‘‘భూమికి బరువయ్యే పంటను పండించాం. మద్దతు ధర ఇచ్చి పండిన ప్రతి గింజలు కొనుగోలు చేశాం. ప్రాజెక్టుల కింద తూములు పెట్టని చరిత్ర మీది. చేసింది ఏమున్నది. రైతు బంధు ఎగ్గొట్టారు. రుణమాఫీ ఎగొట్టారు. వరంగల్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు. మహబూబ్ నగర్ లో రైతు వారోత్సవాలు జరుపుతారట. మార్కెట్‌లో వడ్లు కొనే పరిస్థితి లేదు. రూ.7500 మద్దతు ధర ఉంటే పత్తి రైతులకు లభించింది రూ.6500. రూ.1600, రూ.1700కే వరి అమ్ముకుంటున్నారు’’ అని వివరించారు.
రేవంత్ దెబ్బకు కాంగ్రెస్ సఫా
‘‘రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారం చేసిన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సఫా అయ్యింది. తెలంగాణలో మోసం చేసింది చాలదని, మా వద్దకు వచ్చారని మహారాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టారు. మాటలు, మూటలు కట్టుడు బంద్ చేసి, గ్యారెంటీలు అమలు చేయాలి. చంద్రబాబు లెక్క పాత బకాయిలు కలుపుకొని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అక్రమ అరెస్టులు, కేసులు తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత బంధు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో దళితుల పక్షాన పోరాటం చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు.