లేక్స్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి నో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నిర్ణయం

హైడ్రా చెరువుల్లోని ఇళ్లను కూల్చివేస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లేక్స్ సమీపంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులను నిలిపివేశారు.

Update: 2024-10-03 15:04 GMT

చెరువులు, కుంటలు, సరస్సులు, నదులు, నాలాల సమీపంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి వచ్చిన దరఖాస్తులకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతుల జారీని నిలిపివేశాయి.చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో ఇక ముందు లేక్స్ సమీపంలోని ఇళ్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నిర్ణయం తీసుకున్నాయి.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలలో చెరువుల సమీపంలో ఉన్న 500కు పైగా ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను రెండు ప్రభుత్వ ఏజెన్సీలు నిలిపివేశాయి. లేక్స్ సమీపంలోని ఇళ్లు, లేఅవుట్ ల అనుమతిని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా, అధికారులు మాత్రం చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల లో నెలకొన్న సందిగ్థత కారణంగా ఆయా ఫైళ్లను నిలిపివేశారు.

చెరువుల తుది నోటిఫికేషన్ కోసం ఎదురు చూపు
అవుటర్ రింగ్ రోడ్డు లోపల 580 చెరువులు, కుంటలుండగా, వీటిలో 430 చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లనను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ ను హెచ్ఎండీఏ విడుదల చేయలేదు. కేవలం 130 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రకటించారు. చెరువుల సర్వే పూర్తికాకుండా కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తే సమస్యలు ఎదురవుతాయని అధికారులు అనుమతులను నిలిపివేశారు. చెరువుల తుది నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరికొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ లోగా లేక్స్ సమీపంలోని ఇళ్లకు అనుమతిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని తాము అనుమతులను ఆపినట్లు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగుకు చెందిన ఓ అధికారి చెప్పారు.

హెచ్ఎండీఏ పరిధిలో 3,500 చెరువులుండగా వీటిలో 2,560 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 230 చెరువులకే తుది నోటిఫికేషన్ జారీ చేశారు. చెరువుల సర్వే, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ పూర్తికాక పోవడంతో కొత్త ఇళ్ల నిర్మాణ అనుమతులను అధికారులు నిలిపివేశారు. అక్టోబరు, నవంబరు దసరా సందర్భంగా రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కొనుగోలు దారులు ఇళ్లను ఎక్కువగా కొంటారు. అనుమతులను నిలిపివేయడం వల్ల రియల్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని డెవలపర్ సురేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్ఓసీ ఇస్తేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతి
చెరువుల సమీపంలోని కొత్త ఇళ్లు నిర్మించాలనుకునే భూ యజమానులు నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల జాయింట్ ఇన్ స్పెక్షన్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తేనే తాము ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. చెరువుల వద్ద భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతించిన మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆచి తూచి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.


Tags:    

Similar News