బీజేపీతో పొత్తుపై KTR గుట్టు బయటపెట్టిన దానం

బీఆర్ఎస్ ని విడిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ ని ఇరుకున పెట్టేటట్టే ఉన్నాయి. బీజేపీతో పొత్తుపై కేటీఆర్ గుట్టుని దానం బయటపెట్టేశారు.

By :  Vanaja
Update: 2024-04-21 15:50 GMT

బీఆర్ఎస్ ని విడిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ ని ఇరుకున పెట్టేటట్టే ఉన్నాయి. బీజేపీతో పొత్తుపై కేటీఆర్ గుట్టుని దానం బయటపెట్టేశారు. ఆయన పార్టీ మారి సొంత గూటికి చేరడానికి కారణం కూడా ఇదేనంటూ మీడియా ముందు కుండబద్దలుకొట్టారు.

అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు వీహెచ్ శనివారం అంబర్పేటలోని తన నివాసంలో మౌన దీక్షకి కూర్చున్నారు. "బీజేపీకి మద్దతుగా మాట్లాడానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, దీనిపై కాంగ్రెస్ తగిన విచారణ చేయాలి" అని వీహెచ్ డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన మౌనదీక్షలో కూర్చున్నారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. తనకు ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని, ఆ టికెట్ బయటవారికి ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. తన ఆవేదనపై, తనపై కుట్రల మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.

వీహెచ్ నివాసానికి చేరుకున్న దానం నాగేందర్, ఆయనని సముదాయించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీహెచ్ పై ఒక వర్గం చేస్తున్న అసత్య ప్రచారాలు ఆధారం లేనివన్నారు. బీఆర్ఎస్ పార్టీనే బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుందని ఆరోపించారు. గతంలో కేటీఆర్ స్వయంగా బీజేపీతో పొత్తు పెట్టుకుందామని తనతో అన్నారని చెప్పారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని కేటీఆర్ ని ప్రశ్నించానని.. ఆ ప్రశ్నకు కేటీఆర్ నుంచి సమాధానం రాలేదని తెలిపారు.

ఏదో ఒకరోజు వీళ్లు లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటారని భావించి వారితో తెగతెంపులు చేసుకొని తన సొంత గూటికి వచ్చానని దానం నాగేందర్ అన్నారు. బీజేపీకి ఉన్నది కేవలం సోషల్ మీడియా మాత్రమే. వాటి ద్వారానే అసత్య ప్రచారాలు చేస్తోందని అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి, పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి వీహెచ్ అని గుర్తు చేశారు. ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News