Danam Nagender | ‘హైడ్రా వల్ల హైదరబాద్‌కు నష్టమే’

ఫార్ములా ఈ-కార్ రేస్ ద్వారా హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదంటూ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-01-12 11:38 GMT

ఫార్ములా ఈ-కార్ రేస్ ద్వారా హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదంటూ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వల్ల మనకు నష్టమే జరుగుతుందన్నారు. అదే విధంగా తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్తంత మెరుగు పడ్డాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌ను ఖాళీ చేసిన బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయిందన్నారు.

‘‘ఇటీవల నేను ఏది మాట్లాడినా సంచలనంగా మారుతోంది. మూసీ పరిసర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే కంటితుడుపు చర్యలా ఒకరోజు మూసీ నిద్ర చేశారు. నిద్ర చేయడానికి ముందే అక్కడ ఏసీలు పెట్టించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మూసీ పరివాహక ప్రజల ఇళ్లలో వండిన జొన్న రొట్టెలు తినకుండా బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారు. హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని పలు సంస్థలు ఇక్కడకొచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సురక్షితమైన నగరం కాబట్టే ముంబైకి వెళ్లే సంస్థలు కూడా ఇక్కడి వస్తున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే రాష్ట్ర బడ్జెట్ ఖాళీగా ఉంది. అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్న సంకల్పం కాంగ్రెస్‌కు బలంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒక్కదాని తర్వాత ఒకటి ప్రతి పథకాన్ని అమలు చేస్తోంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులను కూడా అందించనుంది. రుణమాఫీని ఇప్పటికే పూర్తి చేయడం కూడా జరిగింది’’ అని చెప్పారు.

అంతేకాకుండా ఫార్ములా కార్ రేసు వ్యవహారంపై కూడా దానం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘హైడ్రా వల్ల మనకు నష్టం. కేటీఆర్ కు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైదరాబాద్ సిటీకి ఈ ఫార్ములా మంచిదే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఫార్ములా -ఈ రేసు వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. ఫార్ములా- ఈ రేసును ప్రభుత్వం తప్పుపట్టడం లేదు. అందులోని ఆర్థిక లావాదేవీల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని అనుమానం ఉంది.ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ఫార్ములా ఈ రేసును ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదు. సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు భరోసా జరిగినప్పుడు సంబురాలు చేయలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు సంబురాలు చేయలేదు. ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. సీఎంకు పాలాభిషేకం చేయడం లేదు. హైడ్రా వల్ల హైదరాబాద్ కు చాలా నష్టం జరుగుతుంది. మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన చేయాల్సిందే. బీజేపీ వాళ్లు ఏసీలు పెట్టుకొని మూసీ పక్కన ఇళ్లలో పడుకున్నారు. బీజేపీ నాయకులు ప్రజలు ఎలా పడుకుంటే అలా పడుకుంటే చిత్తశుద్ధి ఉండేది’’ అని అన్నారు.

బీఆర్ఎస్‌ను దానం కాకా పడుతున్నారా?

హైడ్రాపై, ఫార్ములా కార్ రేసు వల్ల హైద్రబాద్ ఇమేజ్ పెరిగిందన్న దానం నాగేందర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ కాకా పట్టడానికే దానం ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మళ్ళీ పార్టీ మారాలన్న ఉద్దేశంలో దానం ఉన్నారని, అందుకే ఇప్పటి నుంచే బీఆర్ఎస్‌ను, కేటీఆర్‌ను కాకా పట్టేస్తున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రాను ఆయన తప్పుబడుతున్నారని, ఫార్ములా ఈ-కార్ రేస్ వల్ల హైద్రాబాద్‌కు మంచి జరిగిందని మాట మారుస్తున్నారంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ తమ నేత ఉన్న విషయమే చెప్తున్నారని దానం అనుచరులు అంటున్నారు. ఆయన ఎవరినీ కాకా పట్టాల్సిన అవసరం లేదని ఈ ప్రచారాలను తిప్పికొడుతున్నారు.

Tags:    

Similar News