ఖమ్మంలో గోదావరి జలాల రాకతో సస్యశ్యామలం

సీతారామప్రాజెక్టు నిర్మాణంతో ఖమ్మం,కొత్తగూడెం జిల్లాల్లోని పొలాలు గోదావరి జలాల రాకతో సస్యశ్యామలం కానున్నాయి.ఈ ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

Update: 2024-08-09 14:05 GMT

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల చిరకాల కల ఆగస్టు 15వతేదీన సాకారం కానుంది. రెండు దశాబ్దాల కల నెరవేరుతుండటంతో ఖమ్మం రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. భీమునిగుండం, పూచిగూడెం, కమలాపురం, బిజి కొత్తూరు ఎత్తిపోతల పథకాల నిర్మాణంతో గోదావరి జలాలు సాగుకు అందనున్నాయి.

నెరవేరిన తుమ్మల హామి
గోదావరి జలాలను పొలాల సాగుకు తీసుకువచ్చి రైతన్నల కాళ్లు కడుగుతామని ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన హామీని నెరవేర్ఛేందుకు విశేష కృషి చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేలా సీతారామ ప్రాజెక్టు డిజైన్ చేయించారు.రూ.15వేల కోట్లతో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. 7,500 కోట్ల రూపాయలు వెచ్చిందచి మూడు భారీ లిఫ్టులు నిర్మించారు. సత్తుపల్లి సమీపంలోని యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మించారు.ఈ ప్రాజెక్టు కింద 9వేల క్యూసెక్కుల సాగునీటిని అందించేలా కాల్వలు నిర్మించారు.

సీతమ్మ సాగర్ నిర్మాణం
సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానంగా దుమ్ముగూడెం వద్ద 36 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు సీతమ్మసాగర్ ను నిర్మించారు. 1500 కోట్ల రూపాయలతో 67 శాతం పనులు పూర్తి చేశారు. పాలేరుకు అనుసంధానం చేసేలా లింక్ కెనాల్ నిర్మించారు. జూలూరుపాడు వద్ద రూ.180 కోట్లతో టన్నెల్ నిర్మించారు. డోర్నకల్ వద్ద రూ.300 కోట్లతో 8 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించారు. ఏన్కూరు నుంచి వైరా వరకు 8 కిలోమీటర్ల దూరం సీతారామ కెనాల్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఖరీఫ్ సీజనుకు సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేలా నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు.

9వేల క్యూసెక్కుల గోదావరి జలాలు
భీమునిగుండం వద్ద సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ నుంచి 9వేల క్యూసెక్కుల గోదావరి జలాలను కాల్వలోకి ఎత్తిపోస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పూచిగూడెం, కమలాపురం, బిజి కొత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల వల్ల ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఈ లిఫ్ట్‌ల నుంచి ఏన్కూరు కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేస్తామని, ఏన్కూరు మెయిన్‌ కెనాల్‌ ద్వారా వైరా ప్రాజెక్టును నింపుతామని మంత్రి వివరించారు. సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా చెరువులన్నీ నింపి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు.

ఆగస్టు 15న సీఎం వైరాకు సీఎం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు రెండో పంపును ఆగస్టు 15వతేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల జలసౌధలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌హౌస్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా వైరా చేరుకొని ప్రాజెక్టును ప్రారంభిస్తారని చెప్పారు. వైరాలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. దీంతోపాటు రైతులకు రూ.2లక్షల రుణమాఫీని కూడా చేయనున్నారని అధికారులు చెప్పారు.


Tags:    

Similar News