నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా: సీపీ ఆనంద్
జాతీయ మీడియాకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు.
జాతీయ మీడియాకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాస్త సహనం కోల్పోవడం వల్లే తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదిక పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనలో అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరించారు. పలు వీడియోలను కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను జాతీయ మీడియా సంస్థల వారు పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో ఆయన వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఘటనలకు జాతీయ మీడియా మద్దతు ఇస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో జాతీయ మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఘటనకు సంబంధించి ఉన్న అనుమానాలను ప్రశ్నల రూపంలో అడిగినందుకు తమనే సీపీ తప్పుబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే క్షమాపణలు చెప్తూ సీపీ తాజాగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
‘‘ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మీడియా సమావేశంలో రెచ్చగొట్టే ప్రశ్నలు అడగడంతో కాస్త సహనం కోల్పోయాను. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసింది పొరపాటుగానే భావిస్తున్నా. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటన విషయంలో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే సెలబ్రిటీల బౌన్సర్లకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలని, లేకపోతే తాట తీస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్లు అత్యుత్సాహం కనబరిచారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీ సీవీ ఆనంద్. ‘‘సెలబ్రిటీలు, విఐపీలు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే నిబంధనలు పాటించాలి. సెలబ్రిటీస్, VIP లు బయటికి వెళితే బైన్సర్స్ పెట్టుకుంటున్నారు.. వారేం చేసినా పూర్తి బాధ్యత..వారిదే. సామాన్యులపై దాడులు చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తాట తీస్తాం. నగరంలో బౌన్సర్ల సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. బౌన్సర్ల వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆయా VIP లపై, ఏజెన్సీ లపై కేసులు నమోదు చేస్తాం. ఏదైనా ఘటనలు జరిగిన అనంతరం ఎలాంటి వివరణ ఇచ్చినా సహించం. రాబోయే రోజుల్లో బౌన్సర్ల పై ప్రత్యేక నిఘా పెడతామని.. ఓవర్ యాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. బాధ్యతగా జాగ్రత్తగా వ్యవహారించాలి’’ అని హెచ్చరించారు సీపీ సీవీ ఆనంద్.