కవితని CBI కస్టడీకి అనుమతిచ్చిన న్యాయస్థానం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆమెను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

By :  Vanaja
Update: 2024-04-12 13:40 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆమెను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కవితను కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ స్కాంలో కవిత ప్రధాన సూత్రధారి అని, అందుకు తగిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని, ఈ కేసులో మరిన్ని నిజాలు నిగ్గు తేల్చడానికి ఆమెను విచారించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. దీంతో కవితని మూడు రోజుల సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఆమెను తిహార్ జైలు నుంచి సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించి ప్రశ్నించనున్నారు.

విచారణ సందర్భంగా సీబీఐ కస్టడీ పిటిషన్‌ లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కోర్టుకి తెలిపింది. అలాగే కవిత నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థకు అప్రూవర్‌ శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు పేర్కొంది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. అంతకు ముందు సీబీఐ కస్టడీని సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. కాగా, లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ తరపున అరెస్టైన కవిత ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత నెల 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. మరోవైపు కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసు లోనే కాదు సీబీఐ కేసు లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News