సీఎం రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారిన కోర్టు కేసులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి పలు కోర్టు కేసులు తలనొప్పిగా మారాయి.కీలకమైన ఓటుకు నోటు కేసుతో పాటు పలు కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి.
తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డికి పలు కేసులు వెంటాడుతున్నాయి. ఓటుకు నోటు కేసుతోపాటు కొత్తగా పలు పరువు నష్టం కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. 2015వ సంవత్సరం జూన్ 1వతేదీన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో 2021 జులై 21వతేదీన దాఖలు చేసిన చార్జిషీటును ఏసీబీ వేసింది. బుధవారం నాటి కేసు విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు జడ్జి గత నెల 24వతేదీన విచారణలో ఆదేశించారు. కోర్టు విచారణకు సీఎం రేవంత్, ఉదయసింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కావాల్సి ఉంది. సీఎం కోర్టుకు హాజరు కాకపోతే తాను కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మత్తయ్య చెప్పారు.