HYDRA | శాటిలైట్ చిత్రాల సహకారంతో ‘హైడ్రా’ చెరువుల పరిరక్షణ

హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణపై హైడ్రా దృష్టి సారించింది.హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్ఆర్ఎస్సి కార్యాలయానికి వచ్చి శాటిలైట్ చిత్రాల గురించి చర్చించారు.

Update: 2024-12-24 11:24 GMT

హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణలో ఎన్ ఆర్ ఎస్ సి తీసిన శాటిలైట్ చిత్రాలతోపాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) నిర్ణయించింది.

- లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో సమావేశం హైడ్రా కార్యాలయంలో మంగళవారం జరిగింది. లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతోపాటు వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చెరువుల్లో వ్యర్థాలను పారబోయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. చెరువుల స్థలాలను పరిరక్షించి ఎండిపోయిన చెరువులను పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించారు.
- హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలపై ఎన్ ఆర్ ఎస్ సి తీసిన శాటిలైట్ ఇమేజీల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగనాథ్ ప‌రిశీలించారు. ఎన్ ఆర్ ఎస్ సి అధికారులతో రంగనాథ్ చెరువుల శాటిలైట్ చిత్రాల గురించి చర్చించారు.
- ఎన్ ఆర్ ఎస్ సి అధికారులు కూడా లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీలో భాగ‌స్వామ్యం కావాలని ఏవీ రంగనాథ్ కోరారు.
చెరువుల పరిరక్షణకు మాజీ అధికారుల సహకారం
చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ అంశంపై హైడ్రా నిర్వహించిన వర్కుషాప్‌లో న్యాయ రంగ నిపుణులు, పలు ప్రభుత్వ శాఖల రిటైర్డు అధికారులు పాల్గొన్నారు. రిటైర్డు అధికారులు హైడ్రా అధికారులకు కీలకమైన సూచనలు చేశారు. వివిధ అంశాలలో హైడ్రాకు న్యాయపరమైన సూచనలు సలహాలు అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాజీ అధికారులు చెప్పారు.ఈ స‌మావేశంలో హైకోర్టు న్యాయ‌వాది రేసు మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. రవీందర్ రెడ్డి, ఎన్. శ్రీనివాస్ రావుతో పాటు పలువురు రిటైర్డు అధికారులు పాల్గొన్నారు.

చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
హైదరాబాద్‌ నగరంలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. హైడ్రాకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న పలు చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువుల ఆక్రమణతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

చెరువులను పూడిస్తే కఠిన చర్యలు
చెరువుల్లో మ‌ట్టిపోయడం, వ‌ర‌ద కాలువ‌ల‌ు క‌నిపించ‌కుండా నిర్మాణాలు చేపట్టడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తౌతాని కుంట, భ‌గీర‌థమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగటంతో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాన‌క్‌రామ్‌గూడకు సమీపంలోని తౌతానికుంట‌, భ‌గీర‌థ‌మ్మ చెరువు, నార్సింగిలోని నెక్నాంపూర్ చెరువులు ఆక్రమణకు గురవడంపై ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరదనీటి కాల్వపై అక్రమ నిర్మాణాలు
నాన‌క్‌రామ్‌గూడ‌కు సమీపంలోని వ‌ర‌ద‌నీటి కాలువ‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలు, దుకాణాలు వెంటనే తొల‌గించాల‌ని ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏఅధికారుల‌ను సంప్రదించి స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని కమిషనర్ ఆదేశించారు. గ్రామీణ మ్యాప్‌ల‌తో పాటు నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాల‌కు చెందిన మ్యాప్‌ల‌తో పూర్తి స్థాయి ప‌రిశీల‌న జ‌రిపించి వారం రోజుల్లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News