‘రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం జరుగుతోంది’
తెలంగాణ ప్రభుత్వం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.;
తెలంగాణ ప్రభుత్వం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చడానికి ఆలోచించడం లేదని, ఏకాడికి ఏ హామీని ఎలా ఎగ్గొట్టాలా అనే ప్రణాళికలు రచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా అంతే చేసిందని, ఒక్క రైతుకు కూడా సరైన క్రమంలో రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతులను అన్ని విధాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రేవంత్ మాట నమ్మి.. అప్పులు తెచ్చి బ్యాంకు రుణాలను రూ.2లక్షలకు తీసుకొచ్చిన రైతులను ఈ కాంగ్రెస్ సర్కార్ నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం మద్దతుధర కూడా ఇప్పించడం లేదని, కొనుగోలు కేంద్రాలు కూడా సరిగా పనిచేయడం లేదని హరీష్ రావు విమర్శించారు.
‘‘పత్తి, చెరకు, పసుపు పంటలకు ఒకసారి మాత్రం రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ చెప్తోంది. కొండలు, గుట్టలు సాగు చేసే వారికి రైతు భరోసా రాదని, ఇవ్వమని చెప్తున్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు అందిస్తామన్న ఈ నేతలు.. ఇప్పుడు షరతులు పెడుతున్నారు. రైతు భరోసా అందించడానికి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారంట. బడా కంపెనీలు, కార్పొరేట్ వ్యాపారులకు మాత్రం షరతులు ఉండవు? రైతులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దరఖాస్తు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులు మాత్రం రైతులు తమ చుట్టూ చెప్పులరిగేలా తిరగాలని భావిస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పినట్టు ఎకరానికి రూ.15వేల చొప్పున ఇవ్వాలి. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఒకేసారి రూ.15వేల చొప్పున అందించాలి’’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగు చేసే భూమికే సాయం అందించడం తమ ఉద్దేశమని వెల్లడించారు.
రైతు భరోసాపై షరతులు
కాగా ఇటీవల రైతు భరోసా అమలుపై మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పలు షరతులను ప్రకటించారు. కొండలు, గుట్టలను సాగు చేసుకునేవారికి రైతు భరోసా రాదని చెప్పారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం శాటిలైట్ డేటాను వినియోగించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘సంక్రాంతి నుంచి రైతు భరోసాను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. రైతు భరోసా పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటను వినియోగిస్తామన్నారు. గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను సేకరిస్తున్నాం’’ అని చెప్పారు. సాగు చేస్తున్న రైతుల పేర్లను వ్యవసాయాధికారులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని గుర్తించేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయగల కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు.