చింతల్ బస్తీలో దానం నాగేందర్ హంగామా..
అధికారులు చేపట్టిన కూల్చివేతలు ఆపేయాలని డిమాండ్. లేదంటే ఆందోళన చేస్తామంటూ వార్నింగ్.;
కాంగ్రెస్ నేత దానం నాగేందర్ మరోసారి వార్తలకు కేంద్ర బిందువుగా నిలిచారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చింతల్‌బస్తీ అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అధికారులు బుధవారం ఉపక్రమించారు. ఈ విషయం తెలిసిన వెంటనే దానం నాగేందర్ అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే ఆపేయాలని అన్నారు. అసలు స్థానిక ఎమ్మెల్యేలకు ఒక ముక్క సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని అధికారులను నిలదీశారు. ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చిన పేదలపై దౌర్జన్యం చేస్తున్నారా అంటూ అధికారులపై మండిపడ్డారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే వరకు అక్కడి కూల్చివేతలను నిలిపివేయాలని అధికారులకు సూచించారు. లేనిపక్షంలో పేదలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అయితే కూల్చివేతలకు వ్యతిరేకంగా దానం నాగేందర్ మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వల్ల కూడా హైదరాబాద్‌కు నష్టం వాటిల్లుతుందంటూ గతంలో ఒకసారి వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. అదే విధంగా ఇప్పుడు మరోసారి అధికార యంత్రాంగం చేపట్టిన పనులను అడ్డుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
హైద్రాపై దానం ఏమన్నారంటే..
‘‘హైడ్రా వల్ల మనకు నష్టం. కేటీఆర్ కు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైదరాబాద్ సిటీకి ఈ ఫార్ములా మంచిదే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఫార్ములా -ఈ రేసు వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. ఫార్ములా- ఈ రేసును ప్రభుత్వం తప్పుపట్టడం లేదు. అందులోని ఆర్థిక లావాదేవీల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని అనుమానం ఉంది.ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ఫార్ములా ఈ రేసును ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదు. సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు భరోసా జరిగినప్పుడు సంబురాలు చేయలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు సంబురాలు చేయలేదు. ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. సీఎంకు పాలాభిషేకం చేయడం లేదు. హైడ్రా వల్ల హైదరాబాద్ కు చాలా నష్టం జరుగుతుంది. మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన చేయాల్సిందే. బీజేపీ వాళ్లు ఏసీలు పెట్టుకొని మూసీ పక్కన ఇళ్లలో పడుకున్నారు. బీజేపీ నాయకులు ప్రజలు ఎలా పడుకుంటే అలా పడుకుంటే చిత్తశుద్ధి ఉండేది’’ అని అన్నారు.
బీఆర్ఎస్‌ను దానం కాకా పడుతున్నారా?
హైడ్రాపై, ఫార్ములా కార్ రేసు వల్ల హైద్రబాద్ ఇమేజ్ పెరిగిందన్న దానం నాగేందర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ కాకా పట్టడానికే దానం ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మళ్ళీ పార్టీ మారాలన్న ఉద్దేశంలో దానం ఉన్నారని, అందుకే ఇప్పటి నుంచే బీఆర్ఎస్‌ను, కేటీఆర్‌ను కాకా పట్టేస్తున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రాను ఆయన తప్పుబడుతున్నారని, ఫార్ములా ఈ-కార్ రేస్ వల్ల హైద్రాబాద్‌కు మంచి జరిగిందని మాట మారుస్తున్నారంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ తమ నేత ఉన్న విషయమే చెప్తున్నారని దానం అనుచరులు అంటున్నారు. ఆయన ఎవరినీ కాకా పట్టాల్సిన అవసరం లేదని ఈ ప్రచారాలను తిప్పికొడుతున్నారు. వీటితో పాటు ఇప్పుడు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడ్డుకోవడమే కాకుండా.. ఆందోళన చేస్తామంటూ హెచ్చరించడం కీలకంగా మారింది.