Chamala rao | తెలంగాణ కోసం కేసీఆర్ ఫ్యామిలీ ఏం చేసింది?
తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నాంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి.;
తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నాంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ‘‘తెలంగాణ కోసం పోరాడిన కార్యకర్తగా, కేసీఆర్ కుమారుడిగా, కేసీఆర్ సైనికుడిగా చెప్తున్నా హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్‌ను ప్రపంస్థాయికి తీసుకెళ్లడానికే రేస్ నిర్వహించారు. అవసరమైతే తెలంగాణ కోసం చావనన్న చస్తా కానీ ఇలాంటా వాళ్లకు తలొంచను’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. అసలు తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ కోసం అసలు ఆయన కుటుంబం ఏం త్యాగం చేసింది? అని ప్రశ్నించారు. కుటుంబం మొత్తం పదవులు అనుభవించడమేనా వారి త్యాగం? అంటూ ఎద్దేవా చేశారు.
‘‘తెలంగాణ గురించి, తెలంగాణకు మీరు చేసిన దాని గురించి నువ్వు చెబుతుంటే నవ్వాలో ఎడవాలో తెలియడం లేదు.. తెలంగాణకు మీరు చేసినది ఏం ఉంది? 1600 వందలకు పైగా బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మీ కుటుంబం చేసిన త్యాగం ఏంటీ? డ్రామారావు. కుటుంబం మొత్తం పదవులు అనుభవించిర్రు తప్ప.. ఏం చేశారు? తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి దళిత సమాజాన్ని మోసం చేశారు. నమ్మి అధికారం అప్పజెప్పితే వ్యవస్థలను భ్రష్టుపట్టించి పది సంవత్సరాల పాటు కుటుంబమంతా అధికారంలో ఉన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి వేల కోట్లు రూపాయలను కమీషన్లు, భూముల పేరుమీద వెనకేసుకోని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు అంటే ఈ రోజు తెలంగాణలో అందరికి ఫ్రీ వైద్యం అందిస్తుండాలే. రూ.7 లక్షల కోట్లు అప్పు అంటే ఈ రోజు తెలంగాణలో అందరికి కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఉచితంగా అందిస్తుండాలే. రూ.7 లక్షల కోట్లు అప్పు అంటే హాస్టలలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తుండాలే. రూ.7 లక్షల కోట్లు అప్పు అంటే రైతులకు ప్రతి సంవత్సరం రుణమాఫీ చేయొచ్చు. ఇంకా ఎన్నో చేయొచ్చు. ఇవేం చేయకుండా రూ.7 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశారంటే అక్రమ కాంట్రాక్టుల ద్వారా అందినకాడికి దోచుకోని తెలంగాణ సంపదను హవాలా ద్వారా దేశం దాటించినట్లే కదా.. నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మళ్లీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నావ్. అధికారం వచ్చాక పార్టీ పేరులోని తెలంగాణను పీకేసినరు. చాలు నువ్వు, నీ అయ్య, నీ కుటుంబం చేసిన ఘనకార్యాలు. మీరు చేసిన వాటికి ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు. రేపు ఈడీ, ఏసీబీ, కోర్టులు కుడా మీ ఘనకార్యాలకు తగిన గుర్తింపునిస్తరు’’ అని కిరణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేటీఆర్ ఒక యువరాజు
‘‘కేటీఆర్ సైనికుడు కాదు.. ఒక యువరాజు. మాకు డబ్బు వ్యామోహం లేదు అని కేటీఆర్ అంటున్నారు. కమిషన్ల కోసమే మీ సోదరి ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టద్దు కేటీఆర్. కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారు. రూ.7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా ముట్టజెప్పారు చెప్పాలి. పాత పాటలు పాడొద్దు కేటీఆర్ కొత్త ముచ్చట చెప్పండి తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ మీరు కేసీఆర్ సైనికునివి కాదు, నువ్వు కేసీఆర్ కొడుకువు మాత్రమే. అధికారం కోల్పోయిన యువరాజుకు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీ నాయన 2002లో ఏదైతే నినాదంతో వచ్చాడో ఈరోజు మీరు కూడా అదే నినాదం చెబుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరు. దళిత ముఖ్యమంత్రి, ఉద్యోగ నియామకాలు, కాపలా కుక్కని అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు’’ అని విమర్శించారు చామల.