తెలంగాణ రాజ్యసభ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిని ఫిక్స్ చేసింది.

By :  Vanaja
Update: 2024-08-14 13:20 GMT

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిని ఫిక్స్ చేసింది. ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మనుసింఘ్వి పేరును ఖరారు చేసింది. అభిషేక్ అభ్యర్థిత్వానికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

 

కేకే రాజీనామాతో ఉపఎన్నిక...

2020లో బీఆర్ఎస్ నుంచి కేకే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకు పైగా ఆయన పదవీ కాలం ఉంది. ఆయన జులై 3న గులాబీ పార్టీకి అధికారికంగా గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత రోజు అంటే జులై 4న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. కేకే బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. పార్టీ మారితే ఆయనపై అనర్హత వేటు పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.

ఉపఎన్నిక నోటిఫికేషన్

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. బుధవారం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం అనగా నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Tags:    

Similar News