డ్వాక్రా మహిళలు బస్సు యజమానులు కానున్నారా..!

మహిళల అభివృద్ధి విషయంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలవనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Update: 2024-10-27 10:28 GMT

మహిళల అభివృద్ధి విషయంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలవనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అన్ని రంగాల్లో మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వెల్లడించారాయన. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రుణం లేని వడ్డీలు ఇచ్చి వారిని వ్యాపారస్తులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని, మహిళాభివృద్ధికే ఈ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారాయన. ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది భోజనశాల, లేడీస్ లాంజ్, స్ట్రీ టీ క్యాంటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.25వేల కోట్ల పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో మొత్తం లక్ష కోట్ల రూపాయలను మహిళాభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుందని, ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు. ఆర్టీసీలో సైతం మహిళలను భాగస్వాములను చేయడం కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్టీసీలోకి డ్వాక్రా మహిళలు

మహిళలు అన్ని వ్యాపారాల్లో రాణించాలన్న యోచనతో తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, వడ్డీలేని రుణాలు అందులోని భాగమేనని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క. ‘‘మహిళలను ఆర్టీసీలో కూడా భాగస్వాములను చేయాలని ఆలోయిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చి వారి చేత ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించి వాటిపై వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం, వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి.. అందులో కూడా మహిళలను భాగస్వాములను చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వడ్డీలేని రుణాల పంపిణీని ఒక ఉద్యమంలా అధికారులు ముందుకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు భట్టి.

మహిళల కోసం ప్రతినెలా రూ.400 కోట్లు

మహిళలను తమ ప్రభుత్వం మహాలక్ష్ములుగా కొలుస్తోందని, వారి అభివృద్ధి కోసమే నిరంతరం యోచిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అధికారంలోకి వస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, అందుకోసం తమ ప్రభుత్వం ప్రతి నెల ఆర్‌టీసీకి రూ.400 కోట్లు చెల్లిస్తోందని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యత అప్పగించామని గర్తు చేశారు. మహిళలు ఆర్థికంగానిలదొక్కుకుని బలపడితే వారి కుటుంబం బలపడుతుందని ప్రజా ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కాగా మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోందని మంత్రి సీతక్క గతంలో కూడా వెల్లడించారు.

సీతక్క ఏమన్నారంటే..

ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ ఆర్థికంగా సమర్థంగా ఉండాలని, అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతి చెందాలని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే మహిళలు చేస్తున్న 17 రకాల వ్యాపారాలను గుర్తించి వారికి వడ్డీలేని రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ‘‘మహిళల అభివద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. స్కూల్ యూనిఫార్మ్‌లు కుట్టే పనిని కూడా మహిళలకే అందించాం. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఈ సరస్ ఫెయిర్ అక్టోబర్ 7 వరకు కొనసాగనుంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసిన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది మహిళలు ఈ ఫెయిర్‌లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నాం’’ అని మంత్రి సీతక్క వెల్లడించారు.

Tags:    

Similar News