తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కన్ను

తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపింది. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.

Update: 2024-06-23 10:13 GMT

తెలంగాణలో త్వరలో వర్షాకాల అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు కీలకమైన బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు
కాంగ్రెస్ సర్కారు ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను ప్రవేశపెట్టేందుకు వీలుగా బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు రైతు భరోసాను 5 ఎకరాల లోపు వారికే వర్తింప జేయాలని, సాగు చేస్తున్న భూములకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.దీని కోసం కొత్త బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని సర్కారు యోచిస్తోంది.దీంతోపాటు మరి కొన్ని కీలక బిల్లులను ఉభయ సభల్లో ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
కౌన్సిల్ బిల్లులు పాస్ అవ్వాలంటే...
బిల్లు పాసవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి కనీసం 21 సభ్యుల బలం అవసరం. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులున్నారు. మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకుంటే సర్కారు ప్రవేశపెట్టే బిల్లులు సునాయాసంగా పాస్ చేయించుకోవచ్చు.ప్రస్థుతం 40 మంది కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు సభ్యులే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 27 మంది సభ్యులున్నారు. వీరిలో కనీసం 15 మందిని ఆపరేషన్ ఆకర్ష్ కింద హస్తం గూటిలో చేర్చుకునేందుకు సీఎం దృష్టి సారించారు.
జులైలో వర్షాకాల సమావేశాలు
జులై మధ్య నాటికి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే శాసన మండలిలో మెజారిటీ సాధించాలని అధికార కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.కీలక బిల్లులు సజావుగా ఆమోదం పొందాలంటే మండలిలో మెజారిటీ అవసరం.40 మంది సభ్యుల కౌన్సిల్‌లో అధికార పార్టీకి కేవలం ఆరుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు.అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యులున్నారు.

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్
తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కింద ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై గాలం వేసి వారిని కాంగ్రెస్ గూటిలోకి చేర్చుకోవాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి వ్యూహాలు రూపొందించినట్లు చెబుతున్నారు. సీఎం ప్రతినిధిగా సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేతల యత్నాలు
సీనియర్ కాంగ్రెస్ నేతలైన జానారెడ్డి, మహేశ్వర్ గౌడ్, జగ్గారెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందరినీ టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నట్లు 15 మంది ఎమ్మెల్సీలు, 20 మంది ఎమ్మెల్యేలను గంపగుత్తగా కాంగ్రెస్ గూటిలోకి చేర్చుకొని మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడకుండా జాగ్తత్తలు తీసుకోవాలని వ్యూహం పన్నారు. వర్షాకాల సమావేశాలకు ముందు ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.

ఎమ్మెల్సీల ఫిరాయింపుల పర్వం
ప్రస్తుతమున్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు వాస్తవానికి బీఆర్‌ఎస్‌కు చెందినవారు. వారు డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు.రెండు ఎమ్మెల్సీ ఖాళీలను గవర్నర్ కోటా కింద గవర్నర్ నామినేట్ చేయాలి.కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిల ఫిరాయింపుల నేపథ్యంలో మారిన సమీకరణాల్లో కాంగ్రెస్‌ బలం ఆరుకు చేరగా, బీఆర్‌ఎస్‌ బలం 27కి తగ్గింది.

గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు బిల్లు
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ (హెచ్‌జీసిసి) ఏర్పాటు కోసం రెవెన్యూ చట్టాన్ని సవరించడం, పక్కనే ఉన్న ఏడు మునిసిపల్ కార్పొరేషన్లు, 30 మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసిలో విలీనం చేసేందుకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించడం వంటి కొన్ని కీలక బిల్లులను అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను ఒకే విధంగా అభివృద్ధి చేసేందుకు సిటీ కార్పొరేషన్ ఏర్పాటు దోహదపడనుంది.
తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మొత్తం 40 స్థానాలుండగా రెండు గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్థుతం 38 మంది సభ్యులుండగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులున్నారు. ప్రస్తుతం ఉన్న మొత్తం 38 ఎమ్మెల్సీలలో బీఆర్‌ఎస్‌కు 29 మంది సభ్యులు ఉన్నారు, వీరిలో 25 మంది ఎన్నికయ్యారు, మరో నలుగురిని గవర్నర్ నామినేట్ చేశారు. కాంగ్రెస్‌కు నలుగురితో పాటు, ఏఐఎంఐఎంకు ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు.

తీన్మార్ విజయంతో ఆరుకు పెరిగిన కాంగ్రెస్ బలం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా టి జీవన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత బి మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకటనర్సింగ్ రావు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.ఇటీవల వరంగల్,ఖమ్మం,నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్ల విజయం సాధించారు.

దండే విఠల్ సుప్రీం స్టేతో కొనసాగుతున్నారు...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 30 మంది ఉండగా ఇందులో దండే విఠల్ పై హైకోర్టు అనర్హత వేటు విధించింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ గూటిలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీలున్నారు.ఇందులో ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. దీనికి తోడు కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలులో ఉన్నారు.

ఇద్దరు స్వతంత్ర, మజ్లిస్ ఎమ్మెల్సీలు ఎవరికి మద్ధతు ఇస్తారు?
టీచర్స్ ఎన్నుకున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రఘోత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏవీఎన్ రెడ్డి బీజేపీ తీర్థం స్వీకరించారు.మజ్లిస్ పార్టీ నుంచి మీర్జా రహమత్ బేగ్, మీర్జా రియాల్ ఉల్ హసన్ ఇఫ్తెందీలు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర, మరో ఇద్దరు మజ్లిస్ ఎమ్మెల్సీలు కౌన్సిల్ లో ఏ పార్టీకి మద్ధతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేషన్ ఎప్పుడు?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో గవర్నర్ కోటా కింద కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది.గవర్నర్ కోటా కింద తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా ఎం కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల నామినేషన్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది.గత బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోటా కింద శాసనమండలికి నామినేషన్‌ను తిరస్కరించిన బీఆర్‌ఎస్ నేతలు శ్రవణ్ దాసోజు, కె సత్యనారాయణల నామినేషన్‌ను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19, 2023 నాటి గవర్నర్ ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేసింది.ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్లను తిరస్కరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గతంలో శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్ గూటిలో చేరిన ఎమ్మెల్సీలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ గూటిలో చేరారు. బీఆర్ఎస్ బీ ఫాం మీద ఎన్నికైన ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించినందున ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పక్షాన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు.తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం.దీంతో పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవు.

గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు...
గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు తాము టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ సమర్పించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన కూచకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావు, సంతోష్‌కుమార్, ఆకుల లలిత టీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీలు అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

గతంలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
గతంలో బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ముగ్గురు శాసనమండలి సభ్యులపై అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హులుగా ప్రకటించారు. ఎమ్మెల్సీలు ఎస్ రాములు నాయక్, ఆర్ భూపతిరెడ్డి, కె యాదవరెడ్డిలపై అనర్హత వేటు విధిస్తూ అప్పటి అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News