నవనీత్ కౌర్ వర్సెస్ ఓవైసీ.. పాతబస్తీలో టైమ్ వార్

పాతబస్తీలో టైమ్ వార్ నడుస్తోంది. నిమిషాలు కాదు సెకండ్లు చాలన్న నవనీత్.. సెకండ్లు కాదు గంట తీసుకో అంటున్న అసదుద్దీన్. ఇప్పుడిదే తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్.

By :  Vanaja
Update: 2024-05-09 17:10 GMT

పాతబస్తీలో టైమ్ వార్ నడుస్తోంది. నిమిషాలు కాదు సెకండ్లు చాలు అన్న నవనీత్ కౌర్.. సెకండ్లు కాదు గంట తీసుకో అంటున్న అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడిదే తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బుధవారం మహారాష్ట్ర బీజేపీ మహిళా నేత నవనీత్ కౌర్ పాతబస్తీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత తరపున ప్రచారం చేశారు. ఈ క్రమంలో 12 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.

"మీకు 15 నిమిషాలు కావాలేమో.. మాకు 15 సెకండ్లు చాలు. మేము తలుచుకుంటే ఓవైసీ బ్రదర్స్ కి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు అని" నవనీత్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలకి అసదుద్దీన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "15 సెకండ్లు కాదు గంట తీసుకోండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా.. అధికారం కూడా బిజెపి చేతుల్లోనే ఉంది, ఏం చేయగలరో చేయండి" అంటూ అసద్ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన మాటల యుద్ధం మజ్లిస్, బీజేపీ మధ్య అగ్గి రాజేసింది.

ఇక నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. సరూర్ నగర్ జన జాతర సభలో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యురాలు మీద తక్షణమే ఎన్నికల అధికారులు కేసు పెట్టాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టడం, ఎన్నికల్లో ఓట్లు అడగడం తీవ్రమైన నేరమని అన్నారు. ఆమెను మోడీ, అమిత్ షాలు తక్షణమే వారి పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాగా, 2013లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాల పాటు పోలీసులను తొలగిస్తే 100 కోట్ల మంది హిందువులను అంతం చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాల నుండి, బిజెపి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సిపిఐ సహా పలు రాజకీయ పార్టీలు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. తాజాగా నవనీత్ కౌర్ ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం మరోసారి వివాదానికి తెరలేపినట్టు అయింది.

Tags:    

Similar News