ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సహాయ పనుల్లో కల్నల్
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ప్రాంతంలో 13వరోజైన గురువారం సహాయ పనులను ముమ్మరం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ రంగంలోకి దిగింది.;
By : Shaik Saleem
Update: 2025-03-06 15:05 GMT
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం (National Disaster Management Department) గురువారం రంగంలోకి దిగింది. టన్నెల్ లోపల సహాయ పనులను (SLBC relief work) మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పర్యవేక్షించారు.ఢిల్లీ నుంచి వచ్చిన కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ కు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ టన్నెల్ లో ప్రస్తుతం ఉన్న పరిస్ధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ లో ఇరుక్కున్నారు...
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ (SLBC tunnel) లోపల 13.650 కిలోమీటర్ల ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్ పై రాళ్లు, మట్టి పడి 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్ బోర్ మిషన్ పూర్తిగా ధ్వంసం అయ్యిందని, అందులోనే 8 మంది ఇరుక్కు పోయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టన్నెల్ లోపల నీరు ఉబికి రావడంతో మట్టి, రాళ్లతో టీబీఎం కలిసి పోయిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మెషీన్ ను కొద్దికొద్దిగా కట్ చేస్తూ లోపల చిక్కుకున్న కార్మికుల మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు.
సహాయక చర్యలు వేగవంతం
టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులను గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ లను రప్పించినట్లు తెలంగాణ సహాయ పునరావాస కమిషనర్ అరవింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కన్వేయర్ బెల్ట్ సైతం పనిచేయడం ప్రారంభమైందని, మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీయించే ప్రక్రియ మొదలు పెట్టినందున సహాయక చర్యలు వేగవంతం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం టన్నెల్ లోపలకు క్యాడవర్ డాగ్స్
టన్నెల్ లోపల ఉన్న ప్రస్తుత పరిస్థితులు, కొనసాగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ఎన్.డి ఆర్.ఎఫ్. సిబ్బంది, కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్ స్క్వాడ్ తో కలిసి గురువారం సాయంత్రం టన్నెల్ లోపలకు బయలుదేరి వెళ్లారు. అక్కడ క్యాడవర్ డాగ్ లను ఎక్కడి నుంచి తీసుకువెళ్లాలి, ఏ ప్రాంతంలో చూపించాలి అనే విషయాన్ని పరిశీలించి శుక్రవారం ఉదయాన్నే క్యాడవర్ డాగ్ లను వారి స్క్వాడ్ తో సహా పంపిస్తామని అధికారులు చెప్పారు. ఈ సహాయ పనులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ రఘునాథ్, డోగ్ర రెజిమెంట్ కమాన్డెంట్ పరిక్షిత్ మెహ్రా, ఎన్.డి.ఆర్.ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, జయప్రకాష్ అసోసియేట్ యం.డి. పంకజ్ గౌర్ తదితరులు పర్యవేక్షించారు.