CM Davos Tour | దావోస్ కు బయలుదేరిన సీఎం రేవంత్ బృందం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు సీఎం బృందం దావోస్ బయలుదేరింది.;

Update: 2025-01-19 14:32 GMT

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బృందం మూడు రోజులపాటు జరిపిన సింగపూర్​ పర్యటన ఆదివారంతో ముగిసింది. దీంతో ఆదివారం రాత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం బృందం దావోస్ బయలుదేరింది.

- చివరి రోజు సీఎ రేవంత్ రెడ్డి టీం వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు జరిపింది.రేపటి నుంచి దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్​ ఫోరమ్​ సదస్సులో పాల్గొననుంది.

దావోస్ సదస్సుపై భారీ అంచనాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. సింగపూర్ నుంచి ఆదివారం రాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు దావోస్​ కు బయల్దేరనున్నారు.సీఎం సోమవారం దావోస్​ కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో సీఎం పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయల్దేరింది.సింగపూర్ పర్యటన విజయవంతం కావటంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది.

వ్యాపారసంస్థల ప్రతినిధులతో చర్చలు
చివరి రోజున సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపింది.ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్‌ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్‌ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్‌ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తో చర్చలు జరిపింది.హైదరాబాద్ లో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఎం వారికి వివరించారు.

విజయవంతమైన సింగపూర్ పర్యటన
సింగపూర్ దేశంలో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీ బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది.ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం.

ఫలించిన చర్చలు...ఫ్యూచర్ సిటీలో ఏఐ ఆధారిత డేటా సెంటర్
హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రూ.450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది.రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్‌ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.



Tags:    

Similar News