దావోస్ పర్యటనకు రెడీ అవుతున్న రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు రెడీ అవుతోంది. జనవరి 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ దావోస్‌లో పర్యటించనున్నారు.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు రెడీ అవుతోంది. జనవరి 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ దావోస్‌లో పర్యటించనున్నారు. దావోస్‌లో జనవరి 20 నుంచి 25 వరకు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ 55వ వార్షిక సదస్సు జరగనుంది. ఈ ఫారమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతో పాటు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు మూడు రోజుల పాటు పాల్గొననున్నారు. 2024లో దావోస్‌లో పర్యటించిన సీఎం రేవంత్ దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అవన్నీ కూడా వేరువేరు దశల్లో కార్యరూపం దాలుస్తున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జరిగే దావోస్ ఫారమ్‌లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం, ఆయన బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 13 లేదా 15 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆస్త్రేలియాకు జనవరి 13న వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సంక్రాంతి పండగ తర్వాత జనవరి 15న రేవంత్.. ఆస్ట్రేలియాకు బయలదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో క్వీన్స్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు రేవంత్. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన అనంతరం 19వ తేదీన సింగపూర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ రెండు రోజుల పాటు పర్యటించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా దావోస్ వెళ్లే అవకాశం ఉంది.