ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. వాటిపై చర్చించడానికేనా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అమిత్ షాతో జరగనున్న భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను గురించి కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇటవీల తెలంగాణను ముంచెత్తిన వరద నష్టంపై కూడా ఆయన పలు వివరాలను కేంద్ర మంత్రి ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు కేంద్రం ప్రకటించిన వరద సహాయంపై పునరాలోచన చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం. గతంలో ప్రకటించిన వరద సహాయం అత్యల్పంగా ఉందని, దానిని మరింత పెంచి తెలంగాణ వరద బాధితులకు అండగా నిలవాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
వరద నష్టమే రూ.10వేల కోట్లు
సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలకు తెలంగాణలో ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. వరదలు తగ్గిన అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో పాటు, కేంద్ర ప్రత్యేక టీమ్ కూడా రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. వారి నివేదికల ప్రకారమే తెలంగాణలో వరదల కారణంగా వాటిల్లిన వరద రూ.10 వేల కోట్లు కాగా.. కేంద్రం ప్రకటించిన వరద సహాయం కేవలం రూ.421 కోట్లుగానే ఉండటాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణకు రావాల్సిన పలు నిధుల గురించి కూడా వివిధ శాఖల కేంద్రమంత్రులతో కూడా రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హైకమాండ్‌ను కలిసే అవకాశం..
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ హైమాండ్‌తో కూడా రేవంత్ రెడ్డి చర్చలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ చర్చల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కీలకం కానున్నట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ నిర్వహించే రాష్ట్ర హోం మంత్రుల సమావేశంతో తెలంగాణ హోంమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ హోంమంత్రి పదవిని ఇంకా ఎవరికి కేటాయించకపోవడంతో ప్రస్తుతానికి ఆ బాధ్యతలను కూడా సీఎం రేవంత్ రెడ్డే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిశాఖతో కలిసి రేవంత్ రెడ్డి.. ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ హోం మంత్రి పదవిని ఎవరికి కేటాయించాలి అన్న విషయాలపై రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.