గుడ్ న్యూస్ : తెలంగాణ సివిల్స్ అభ్యర్థులకు రూ. లక్ష చెక్కులు

యుపిఎస్‌సి ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి మెయిన్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.

By :  Vanaja
Update: 2024-08-26 15:25 GMT

యుపిఎస్‌సి ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి మెయిన్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారికి రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం కింద రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించింది. స‌చివాల‌యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి... 135 మంది అభ్యర్థులకు రూ . లక్ష చెక్కులు అందించారు. అనంతరం మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

ద్రౌప‌ది స్వ‌యంవ‌రం స‌మ‌యంలో అర్జునుడి ల‌క్ష్యం చేప క‌న్నుపై కేంద్రీకృత‌మైన‌ట్లే సివిల్స్‌లో ఎంపిక కావ‌డ‌మ‌నే ఏకైక ల‌క్ష్య‌మే మీకు ఉండాల‌ని, కుటుంబ‌, ఆర్థిక‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అభ్యర్థులకు రేవంత్ సాధించారు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన వారికే కాదు... మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారికీ రూ.1లక్ష సాయం అందిస్తామని మాటిచ్చారు. "నిరుద్యోగులు, విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. ప్రజా ప్రభుత్వంగా అధికారంలోకి రాగానే దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఉద్యోగాలను భర్తీ చేసాం. మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. మరో 35వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్దిని నిరూపించుకుంటున్నాం" అని రేవంత్ చెప్పారు.

రాష్ట్ర ప్రతిష్టను పెంచండి...

తెలంగాణ నుంచి అత్యధికంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని రేవంత్ మెయిన్స్ అభ్యర్థులకు సూచించారు. అందుకోసమే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం చేపట్టామన్నారు. "ఆర్ధిక సాయం కంటే మీరు మా కుటుంబ సభ్యులు అనే విశ్వాసం కల్పించేందుకే ఈ కార్యక్రమం. సచివాలయం తెలంగాణ ప్రజలదని నమ్మకం కలిగించేందుకే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రిలిమ్స్ లోనే కాదు.. మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించాలి. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా నిలబడుతుంది. మీరు పరీక్షలపైనే దృష్టి పెట్టండి... మీ కుటుంబానికి, రాష్ట్రానికి గౌరవం పెంచండి" అని పిలుపునిచ్చారు సీఎం.

స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ...

రాష్ట్రంలో సర్టిఫికెట్ కోర్సులకే విద్య పరిమితమవుతోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. "నైపుణ్యం లేకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. కొంతమంది విజ్ఞుల సూచనతో యూనివర్సిటీ నిర్వహణకు ఇండస్ట్రీ డ్రివెన్ విధానం తీసుకున్నాం. అందుకే ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా నియమించాం. వచ్చే ఏడాది నుంచి 20వేల మందికి స్కిల్ యూనివర్సిటీ శిక్షణ అందిస్తుంది" అని ప్రకటించారు.

దేశానికే తలమానికంగా తెలంగాణ...

ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో చిన్న చిన్న దేశాలు ప‌దుల సంఖ్య‌లో ప‌త‌కాలు సాధిస్తే... 140 కోట్ల జ‌నాభా ఉన్న మ‌న దేశం మాత్రం ఆశించిన స్థాయిలో ప‌త‌కాలు సాధించ‌లేద‌ని, ఇది ఒక ర‌కంగా మ‌న‌కు అవ‌మాన‌క‌ర‌మేన‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవ‌ల ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌లో ఓ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి వెళ్లాన‌ని, ఆ యూనివ‌ర్సిటీలో శిక్ష‌ణ పొందిన వారు 19 ప‌త‌కాలు సాధిస్తే, ఒక క్రీడాకారిణి ఏకంగా మూడు స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించింద‌న్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో మ‌న యువ‌త పెద్ద సంఖ్య‌లో ప‌త‌కాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ యూనివ‌ర్సిటీ నుంచి అత్య‌ధిక ప‌త‌కాల సాధ‌న ద్వారా తెలంగాణ దేశానికే త‌ల‌మానికంగా నిల‌వాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

అన్నిరకాల వసతులతో వసతి గృహాలు...

వసతి గృహాల్లో సరైన మౌలిక వసతులు ఉండటం లేదు, అందుకే అన్ని రకాల మౌలిక వసతులతో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ గురుకులలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. "ప్రతీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రేసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నాం. పది, పదిహేను రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తాం. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయబోతున్నామని సీఎం వెల్లడించారు.

రాజకీయ లబ్ది కోసం రెచ్చగొడుతున్నారు...

కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్లు లబ్ది పొందారన్నారు. వాళ్ల ఉద్యోగాలు పోతే తప్ప వారికి విద్యార్థులు, నిరుద్యోగులు గుర్తురాలేదని విమర్శించారు. "మీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది... నిరసనలు, ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదు. కొంతమంది కుట్రలకు మీరు పావులుగా మారకండి. ప్రభుత్వ నిర్ణయాలపై మీరు సొంతంగా ఆలోచన చేయండి. మా ప్రభుత్వ ప్రాధాన్యత విద్య, ఉద్యోగకల్పన, రైతు సంక్షేమం. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి... మీ అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. మీ చూపు మీ లక్ష్యం వైపు మాత్రమే ఉండాలి.

Tags:    

Similar News