కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉన్న పరిస్థితి చూస్తున్నామన్నారు.
By : Shaik Saleem
Update: 2024-11-11 13:31 GMT
‘‘తెలంగాణలో గత పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతుండు..మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు,ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు’’ అని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వ్యాఖ్యానించారు.
మహిళలకు ఉచిత ప్రయాణంతో లబ్ది
ఆర్టీసీ బస్సుల్లో కోటి 5లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారని సీఎం రేవంత్ చెప్పారు.నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు.49.90 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారని చెప్పారు.రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు.
టీచర్లను నియమించాం
రాష్ట్రంలో 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారని,35వేల మంది టీచర్లను బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని సీఎం రేవంత్ చెప్పారు.‘‘కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం,విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నామని సీఎం చెప్పారు.
నిరుద్యోగులను ఆదుకున్నాం...
ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని సీఎం పేర్కొన్నారు. త్వరలో వారికి నియామకపత్రాలు అందించి, వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని సీఎం ప్రకటించారు.పది నెలల తన పాలనలో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నామన్నారు. ‘‘మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది.ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి..బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం’’ అని రేవంత్ కేసీఆర్ కు చురకలు అంటించారు.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు
సోమవారం అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుతూ.. పది నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం పేర్కొన్నారు. కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే రవాణా శాఖ సంపూర్ణ సహకారం ఉండాలని సీఎం కోరారు.త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక పాలసీ తీసుకొస్తామని ఆయన వివరించారు.
హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) November 11, 2024
☑️నగరంలోని… pic.twitter.com/2VA3m3TIAY