తెలంగాణలో టార్గెట్ సీఎం ఆపరేషన్ స్టార్ట్ అయిందా..?

బీజేపీ.. టార్గెట్ సీఎం రేవంత్ ఆపరేషన్‌ను స్టార్ట్ చేసిందా? అన్నట్లు ఉన్నాయి పరిస్థితులు. అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డినే టార్గెట్‌గానే విమర్శలు గుప్పిస్తుండటమే ఇందుకు కారణం.

Update: 2024-09-30 11:55 GMT

తెలంగాణలో బీజేపీ.. టార్గెట్ సీఎం రేవంత్ ఆపరేషన్‌ను స్టార్ట్ చేసిందా? అన్నట్లు ఉన్నాయి పరిస్థితులు. అనేక అంశాలకు సంబంధించి బీజేపీ నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుండటమే ఇందుకు కారణం. హైడ్రా, మూసీ సుందరీకరణ, రైతు రుణమాఫీ ఇలా మరెన్నో అంశాల్లో సీఎం రేవంత్‌నే దోషిగా నిలబెడుతున్న కాంగ్రెస్ నేతలు. మొన్నటి వరకు హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండిసంజయ్ మండిపడ్డారు. కాగా సోమవారం.. తెలంగాణ రైతుల సమస్యలను ఉద్దేశించి ఎంపీ ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు.. సీఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల విషయంలో అన్న దశల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నోరునొచ్చకుండా హామీలు ఇచ్చిన రేవంత్.. వాటి అమలు విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నారని, కొన్నింటిని నామమాత్రంగానే అమలు చేశారని అన్నారు. వాటిలో రైతు రుణమాఫీ కూడా ఒకటి అని, ఇప్పటికి కూడా సగానికి పైగా లబ్ధిదారులకు రుణమాఫీ కాలేదని, ఏంటని అడిగితే మీ రుణం రూ.2 లక్షలు పైబడి ఉందని, ముందు ఆ పైమొత్తాన్ని రైతులు చెల్లిస్తే మిగిలిన రూ.2 లక్షలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేస్తుందనడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేతలు విమర్శించారు.

అప్పట్లో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్

‘‘పదేళ్లపాటు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా రైతులను కేసీఆర్ మోసం చేశారు. దాని వల్ల ఎందరో అన్నదాతలు అసువులు బాశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథాలో నడుస్తోంది. ఎన్నికల ముందు రైతులపై వరాల జల్లు కురిపించిన రేవంత్.. సీఎం పీఠం అధిష్టించిన తర్వాత రైతులను పట్టించుకోవడం మానేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ పూర్తిస్థాయిలో విఫలమైంది. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అపఖ్యాతి మూటగట్టుకుందే.. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే అంతకు మించిన అపఖ్యాతిని మూట గట్టుకుంది. ఎవరు ఏంచేసినా రైతులకు న్యాయం జరగాలి’’ అని రఘునందనరావు కోరారు. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో రఘునందన రావు.. ఈ మేరకు విమర్శలు చేశారు. ఈ సందర్భంగానే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ సుందరీకరణ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు. తెలంగాణ రైతుల సమస్యలను తీర్చే సామర్థ్యం ఒక్క బీజేపీకే ఉందని ఆయన చెప్పారు.

రైతును ఆదుకునే నాథుడే కరువు

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను నమ్మించి మోసగించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగానే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రారని, సీఎం రేవంత్ రెడ్డి.. పేదల ఇళ్లనే కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ. రేవంత్ పాలనలో ముస్లింలను ఒకలా.. హిందువులను ఒకలా చూస్తున్నారని, హైడ్రా పేరుతో మొదలు పెట్టిన అన్యాయపు కూల్చివేతల్లో కూడా హిందువులే టార్గెట్‌గా మారుతున్నారని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, బోనస్ ముచ్చటే లేదని, అసలు ప్రజలకు ప్రశాంతతే కరువైందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. రైతుల బతుకుల్లో వెలుగు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని, పంట నష్టం జరిగినా పట్టించుకునే నాథుడే లేకపోవడం ఇందుకొక కారణమని అర్వింద్ ఆరోపించారు.

అగ్రికల్చర్ పాలసీ ఏది..?

తెలంగాణను కేసీఆర్ నట్టేట ముంచారు.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారి పది నెలలు ముగుస్తున్నా ఇప్పటి వరకు అగ్రికల్చర్ పాలసీని ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. మాజీ మంత్రి కేటీఆర్‌కు అల్లం, పసుపుకు కూడా తేడా తెలియదని, ఆయనలాగే వరి పంట మాత్రమే వేసుకునే దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఆయన. రైతుల సమస్యలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం ఇసుమంతైనా ప్రయత్నం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సమయంలో కనిపించిన రైతు సమస్యలు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌కు ఎందుకు కనిపించడం లేదు? అని నిలదీశారు. వీటన్నింటికీ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

టార్గెట్ సీఎం రేవంత్..

బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా ఒక్కో అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయడం ఏదో ఆపరేషన్‌లా అనిపిస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతు సమస్యలు, హైడ్రా కూల్చివేతలు ఏదైనా సమస్యల గురించి సదరు నేతలు ఆయా శాఖల మంత్రులకు ఎందుకు ప్రశ్నించడం లేదని, బీజేపీ నేతలు తమ వేళ్లను నేరుగా సీఎం రేవంత్ వైపే ఎందుకు చూపుతున్నారని కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు, వాటికి మంత్రులు ఉన్నా కూడా అన్ని ప్రశ్నలకు, సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డే పరిష్కారం చూపాలన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అది సరైన పద్దతి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగని తాము ప్రభుత్వానికి మద్దతు తెలపడం లేదని, వేయాల్సిన ప్రశ్న సరిగా, సరైన వ్యక్తికి వేయాలని చెప్తున్నామంతే అని వారు వివరిస్తున్నారు.

Tags:    

Similar News