అప్లికేషన్ ఏం లేదు.. వదంతులు నమ్మొద్దు: పౌరుసరఫరాల శాఖ

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అప్లికేషన్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాము ఇప్పటి వరకు ఎటువంటి అప్లికేషన్న విడదుల చేయలేదని స్పష్టం చేసింది.

Update: 2024-10-07 13:39 GMT

‘తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం రాష్ట్ర పౌరసరఫాల శాఖ అప్లికేషన్ విడుదల చేసింది. ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ఆలస్యం చేశారా అంతే సంగతులు.. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు వెంటనే అప్లై చేసుకోండి’ ఇలా కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టతనిచ్చింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి తాము ఎటువంటి అప్లికేషన్ విడుదల చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను, వదంతులను నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ.. ప్రజలను కోరింది. ఏదైనా ఒక విషయాన్ని నమ్మే ముందు ఒకటి రెండు సార్లు రూఢీ చేసుకోవాలని, అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించాలని వివరించారు. అంతేకాకుండా తమ శాఖ ఏదైనా ప్రకటన చేస్తే.. దాన్ని ప్రతి ఒక్కరికీ చేరువచ్చే అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తామని, తాము అధికారికంగా చెప్పనంత వరకు ఎటువంటి వదంతులు వినిపించినా పట్టించుకోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇప్పటి వరకు రూపొందించలేదని, ఎలాంటి దరఖాస్తులు స్వీకరించట్లేదంటూ తెలుగులో పోస్ట్ పెట్టింది. దీంతో ఇప్పటి వరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వచ్చేశాయంటూ వినిపించినవి మొత్తం గాలి వార్తలుగా నిర్ధారితమైపోయింది.

డిజిటల్ కార్డు కోసం స్పెషల్ యాప్

తెలంగాణలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్‌ను తెలుగులో రూపొందించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. అటువంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటుగా రేషన్ కార్డు లేని వారు.. ఈ దరఖాస్తు నింపి ఆధార్ సంఖ్య, సభ్యుల జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఫొటోను జతచేసి స్థానిక వీఆర్‌ఓలకు అందించాలని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నమ్మిన వారు దరఖాస్తులు నింపి, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ హడావుడిగా తిరిగేస్తున్నారు. దీంతో ఈ ప్రచారం కాస్తా ప్రభుత్వం చెవికి చేరింది. దీంతో వెంటనే దీనిపై క్లారిటీ ఇవ్వాలని, ప్రజలకు ఈ తప్పుడు ప్రచారం నుంచి బయటకు తీసుకురావాలని ప్రభుత్వం భావించి ఈరోజు అధికారిక ప్రకటన చేసింది. ఈనేపథ్యంలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం ఎటువంటి యాప్‌ రూపొందించలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధకారికంగా ప్రకటించారు.

Tags:    

Similar News