చైనా మాంజాపై సీపీ ఆనంద్ ఆగ్రహం..
ద్విచక్ర వాహనదారులను బెంబేలెత్తిస్తున్న చైనా మాంజా. అసలు అది చైనాది కాదన్న సీపీ సీవీ ఆనంద్.;
చైనా మాంజా ప్రస్తుతం బైకర్స్‌కు పీడకలలా మారింది. ఎప్పుడు ఎటునుంచి వచ్చి మెడకు చెట్టుకుంటుందో అర్థం కాక బైక్‌లపై ట్రావెల్ చేరసేవార భయంభయంగానే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. అందులోనూ సంక్రాంతి పండగ అంటే గాలిపటాలు ఎగరేయడం ఒక సాంప్రదాయంలా వస్తుంది. అది కాస్తే ఇప్పుడు బైకర్స్‌కు మరింత భయం కలిగిస్తోంది. సంక్రాంతి ముగిసిన క్రమంలో ఎక్కడెక్కడ చైనా మాంజాలు వేళాడుతుంటాయో తెలియగా బిక్కుబిక్కుమంటూ బయటకు రావాల్సి వస్తోంది. సంక్రాంతి పండగ వేళ రోడ్డుపై ప్రయాణాలు చేసే వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. చైనా మంజాపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. చైనా మంజాను వినియోగించినా, విక్రయించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు సైతం ఇదే విషయాన్ని పలుమార్లు ఉద్ఘాటించినా చైనా మాంజా విక్రయాలు, వినియోగాలు ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది సంక్రాంతి వేళ కూడా విచ్చలవిడిగా చైనా మాంజా వినియోగం జరిగింది. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. చాలా మంది గొంతులకు ఈ చైనా మాంజా అడ్డుపడి తెగిపోయాయని పోలీసులు తెలిపారు. ఈనేపథ్యంలోనే అసలు ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపట్టినా చైనా మాంజా విక్రయాలు ఎలా జరుగుతున్నాయి? ప్రభుత్వం, అధికారులు అంటే లెక్కలేని తనమా? యంత్రాంగం అలసత్వంగా ఉండటం వల్లనా? అన్న అనుమానాలు ప్రజల్లో అధికం అవుతున్నాయి. చైనా మాంజాను పూర్తిగా బ్యాన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చైనా మాంజా అంశంపై ప్రజలు అడుగున్న ప్రశ్నలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. అసలు ఇన్ని చర్యలు తీసుకున్నా చైనా మాంజా ఎలా అందుబాటులో ఉంటుంది అన్న అంశాలపై వివరణ ఇచ్చారు.
పేరుకే చైనా మాంజా
చైనా మాంజా అని చెప్తున్నప్పటికీ అది చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్నది కాదని సీవీ ఆనంద్ వివరించారు. దానిని లోకల్‌గానే తయారు చేస్తున్నారని తెలిపారు. ‘‘మాంజా దారాన్ని స్థానికంగా తయారు చేస్తుండటం వల్లే అది విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చేస్తుంది. చైనా మాంజను పూర్తిగా నియంద్రించడం కోసం అతిత్వరలోనే ఈ-కామర్స్ సైట్స్‌కు సంబంధించిన గోదాముల్లో కూడా సోదాలు చేపడతాం. ఈ-కామర్స్ సైట్స్ నిర్వాహకులతో సైతం సమావేశం ఏర్పాటు చేస్తాం. చైనా మాంజా విక్రయాలను పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకుంటాం. చైనా మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి. ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది’’ అని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
చైనా మాంజా మహా షార్ప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా వల్ల తీవ్ర ప్రమాదం జరిగింది. సంక్రాంతి సందర్భంగా పతంగి ఎగరేయడానికి వినియోగించిన చైనా మాంజా దారం ఓ బైకర్ మెడకు చెట్టుకుంది. గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. యాదగిరిగుట్టలో ఓ వృద్ధ దంపతులు కూడా బైక్ వెళ్తున్న క్రమంలో చైనా మాంజా తగలడంతో వారు కింద పడిపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్‌లో కూడా ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇది కేవలం తెలంగాణలోనే కాదు యావత్ దేశంలో చైనా మాంజా అతిపెద్ద సమస్యగా మారింది. దీనిని అరికట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి.